• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధం: చేరుకుంటున్న అతిథులు

By Nageswara Rao
|

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో దసరా రోజున అక్టోబర్ 22(గురువారం)న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి రాయబారులు, వీవీఐపీలు ఒక్కొక్కరిగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అతిథుల రాకతో గన్నవరం విమానాశ్రయం కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అతిథుల కోసం విజయవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి జపాన్, సింగపూర్ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న అతిథులకు మంత్రి కామినేని శ్రీనివాస్ స్వాగతం పలికారు.

Andhra Pradesh new capital Amaravati foundation ceremony

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమానికి మరికొన్ని గంటలే ఉండటంతో ఉద్దండరాయుని పాలెంకు పెరిగిన సందర్శకుల తాకిడి పెరిగింది.

పోలీసు బందోబస్తు, ఆంక్షలు

అమరావతి రాజధానికి సమయం దగ్గర పడుతుండటంతో సామాన్యులు, ప్రముఖులు తరలి వస్తున్నారు. అయితే, కేంద్ర నిఘా సంస్థ, ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆంక్షలు విధించారు. సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. పనులన్నీ పూర్తి కావటంతో బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది.

Andhra Pradesh new capital Amaravati foundation ceremony

అంతక ముందు శంకుస్థాపన కార్యక్రమాలకు ఆటంకం కలిగినా, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో స్థానికులు సెల్ఫీలు దిగినా.. వారి ఉత్సాహం నీరుగార్చలేక పోలీసులు అంగీకరించారు.

అతిథుల కోసం ఖరీదైన కార్లు ఇచ్చిన విజయవాడ వాసులు

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి 2లక్షల మంది వస్తారని అంచనా వేసి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అమరావతి శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి తరలివచ్చే వీవీఐపీల కోసం విజయవాడలోని ప్రముఖులు తమ ఖరీదైన కార్లను స్వచ్ఛదంగా ఇచ్చారు. బెంజ్‌, రేంజ్‌ రోవర్‌, జాగ్వార్‌, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లను ప్రభుత్వానికి ఇచ్చారు.

అమరావతిలో హెలికాప్టర్‌ ద్వారా మట్టి, నీరు చల్లిన చంద్రబాబు

అమరావతి పరిసర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం విహంగ వీక్షణం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన జరిగే ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టి, జలాలను అమరావతి ప్రాంతంలో చల్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజధాని తొలి దశ నిర్మాణం 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ హాజరు

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్ హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని జాతీయ నేతలు అభినందనలతో ముంచెత్తారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, చోళులు పరిపాలించిన నేలపై ఏపీ నూతన రాజధాని నిర్మాణం భారత సంస్కృతికి పట్టం కట్టడమేనంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు.

Andhra Pradesh new capital Amaravati foundation ceremony

ప్రజా రాజధానిని నిర్మించే కార్యదక్షత చంద్రబాబుకే ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రపంచంలోనే అందమైన నగరంగా అమరావతి నిలుస్తుందంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, మాజీ ప్రధాన సైనికాధికారి వీకే సింగ్ అభినందనలతో ముంచెత్తారు.

7 హెలిప్యాడ్‌లు

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 3 వేల మంది వరకు వీఐపీలు హాజరుకానున్నారు. ప్రధాని, ఇతర ప్రముఖుల కోసం ఏడు హెలిప్యాడ్‌లు నిర్మించారు. ప్రధాన వేదిక, సాంస్కృతిక వేదిక, పారిశ్రామికవేత్తలు ఆసీనులయ్యేందుకు మరో వేదిక నిర్మించారు. అలాగే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన దాదాపు 25వేల మంది రైతులు కూర్చోవడానికి వీలుగా ప్రధాన గ్యాలరీ నిర్మాణం పూర్తి చేశారు.

15 ఎల్‌ఈడీ స్క్రీన్లు

శంకుస్థాపన కార్యక్రమం అంతా ప్రజలకు కనిపించేలా సభాప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక, సభాప్రాంగణం మొత్తాన్ని ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) తమ ఆధీనంలోకి తీసుకుంది. రాజధాని శంకుస్థాపన సందర్భంగా సేవలందించేందుకు తుళ్లూరు, పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 2వేల మంది యువకులను సమీకరించారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో

శంకుస్థాపన కార్యక్రమంలో బందోబస్తు నిర్వహించేందుకు 14 వేల మంది పోలీసులను వివిధ ప్రాంతాల నుంచి పిలిపించారు. 12 మంది ఐపీఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. శంకుస్థాపన వేదిక ప్రాంగణంలో 25 సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో మరో 25 సీసీ కెమెరాలు అమర్చారు. పార్కింగ్‌ స్థలాలను డీఐజీ స్థాయి అధికారి, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సకల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు, టీవీల దృశ్యాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. వేదిక ప్రాంగణంలోకి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు.

రూట్ మ్యాప్ ఇదే

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాహనాలు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ముఖ్యమైన సూచనలు చేశారు.

Andhra Pradesh new capital Amaravati foundation ceremony

గన్నవరం విమానాశ్రయంలో దిగి వేదికకు వచ్చే వారు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు దారిలో కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లి చేరుకోవాలి. తాడేపల్లి వద్ద వంతెన కింద నుంచి కుడివైపు తిరిగి పంప్ హౌస్, ఎన్టీఆర్ కట్ట మీదుగా ఉండవల్లి జంక్షన్‌కు, అక్కడి నుంచి ఉండవల్లి వంతెన దాటి ఎడమవైపు తిరిగి భీష్మాచార్య రోడ్డు మీదుగా ఉద్ధండరాయుని పాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకోవచ్చు.

సాధారణ పాసులు ఉన్నవారు ఇదే దారిలో ఉండవల్లి జంక్షన్ నుంచి స్క్రూ బ్రిడ్జి మీదుగా వేదిక వద్దకు వెళ్లాల్సి వుంటుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు సైతం తాడేపల్లి వరకూ వచ్చి ఇదే దారిలో చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వారు నందిగామ, ఇబ్రహీంపట్నం దాటాక గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, రామవరప్పాడు మీదుగా బెంజ్ సర్కిల్ చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది.

వీటితో పాటు గుంటూరు జిల్లా అమరావతి నుంచి మద్దూరు కొండ మీదుగా తుళ్లూరు వరకూ వచ్చే జిల్లా రహదారి, మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వెళ్లే రహదారులను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు పెదకూరపాడు నుంచి అమరావతి, గుంటూరు రోడ్డును క్రాస్ చేస్తూ తుళ్లూరు వెళ్లే రోడ్డును, తాడికొండ నుంచి పెదపరిమి మీదుగా ఉన్న రహదారిని విస్తరించారు.

గుంటూరు దాటిన తరువాత కంతేరు, నిడమర్రు, ఐనవోలు మీదుగా రహదారిని సైతం రెడీ చేశారు. ట్రాఫిక్ ను బట్టి ఏ వాహనం ఏ దారిలో వెళ్లాలన్న విషయాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సాధారణ ప్రజలు వాహనాల కోసం విజయవాడ-అమరావతి రోడ్డు మార్గంలో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

అతిథులకు నోరూరించే వంటలు

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి అతిథులుగా వచ్చే వీఐపీలకు నోరూరించే వంటకాలను నిర్వాహకులు సిద్ధం చేశారు. అందరికీ సంతృప్తి కలిగించేలా వంటలను తయారు చేయించారు. మహిళా మంత్రులు దగ్గరుండి మరీ వంటలాను పర్యవేక్షించారు.

గురువారం నుంచే ప్యాకింగ్‌ చేసి శంకుస్థాపన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. విఐపీలకు వంటకాలు.. చక్కెర పొంగలి (100 గ్రాములు), పులిహోర (150 గ్రాములు), గారె ఒకటి, పూర్ణం బూరె ఒకటి, ఫ్రూటీ ఒకటి, మంచి నీళ్ల సీసా ఒకటి (500 ఎంఎల్) ఇస్తారు. రైతులకు.. చక్కెర పొంగలి (75 గ్రాములు), పులిహోర (150 గ్రాములు), దద్దోజనం (150 గ్రాములు), తాపేశ్వరం కాజా ఒకటి, అరటి పండు ఒకటి, మంచినీళ్ల సాసాలు రెండు (200 ఎంఎల్) ఇవ్వనున్నారు.

Andhra Pradesh new capital Amaravati foundation ceremony

వీవీఐపీలకు ఆహారంతో పాటు స్నాక్స్‌గా పూర్ణం, డ్రైఫ్రూట్స్, కార్న్ సమోసా, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు. వీవీఐపీలకు శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే ప్రత్యేకమైన టెంట్‌ ఏర్పాటు చేశారు. వారికి ఆకలి పుట్టించే సూప్‌లు, చిరుతిళ్లు, భోజనం, భోజనానంతరం పళ్లు, ఇతర పదార్థాలు అందుబాటులో ఉంచుతారు.

లెమన్‌ జ్యూస్, గ్రీన్‌సలాడ్‌, మొలకెత్తిన గింజలు, మొక్కజొన్న సలాడ్‌లతో పాటు భోజనం అందిస్తారు. కొత్తావకాయ, గోంగూర, మిరియాల రసం, మెంతీ మజ్జిగ, వంకాయ పచ్చిపులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ పచ్చడి, కరివేపాకు కారం, కొబ్బరి శనగకారం, అప్పడాలు, బెల్లం-తేనె జిలేబీ, నేతిబొబ్బట్లు అందిస్తారు. వివిధ రకాల పండ్లు, మూడు రకాల ఐస్‌క్రీమ్‌లు, మిఠాయి కిళ్లీ, సాధారణ కిళ్లీలు ఇస్తారు.

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదీ...

మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.30-12.35 మధ్య మోడీ అమరావతి గ్యాలరీ సందర్శిస్తారు.
12.35-12.43 మధ్య శంకుస్థాపనలో పాల్గొంటారు.
12.43-12.45 మధ్య ప్రధాన వేదిక వద్దకు ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.45-12.48 మధ్య ప్రధానికి, అతిథులకు పుష్పగుచ్చాలు అందిస్తారు.
12.48-12.50 వరకు మా తెలుగు తల్లికి గీతాలాపన
12.50-12.53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగిస్తారు.
12.53-12.56 సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం.
12.56-1.01 వరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం.
1.01 - 1.11 వరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం.
1.11 - 1.43 వరకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
1.43 - 1.46 వరకు ప్రధాని, అతిథులకు జ్ఞాపికలు.

English summary
The foundation stone for Andhra Pradesh's new capital Amaravati will be laid tomorrow. Pitched as a world-class riverfront capital city, Amaravati will be an energy-efficient and green city with concentration on industrial hubs. Here is a look at the layout plans of the new capital and its rich history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X