ఏపీ ఆలయాల ఘటనల్లో షాకింగ్- నిధుల వేట- మద్యం మత్తులోనే విధ్వంసాలు
ఏపీలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టులు కూడా చేస్తున్నారు. పలు కేసుల్లో పురోగతి ఉందని పోలీసులు ప్రకటించారు. అయితే రాష్టంలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలను స్ధూలంగా గమనిస్తే ఇందులో రాజకీయ ప్రమేయం కనిపించడం లేదని తెలుస్తోంది. కేవలం నిధుల వేట కోసం సాగిస్తున్న అన్వేషణతో పాటు మద్యం మత్తులో జరిగిన ఘటనలే ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తు చెబుతోంది.

విగ్రహాల విధ్వంసంపై చురుగ్గా దర్యాప్తు
ఏపీలో వరుసగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసంపై ఇప్పటికే పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇందులో దర్యాప్తును కూడా శరవేగంగా సాగిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు విగ్రహాల విధ్వంసంలో వెలుగుచూస్తున్న పలు అంశాలు పోలీసులకు కూడా షాకిచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే విగ్రహాల విధ్వంసంపై రాష్ట్రంలో రాజకీయ విమర్శల వేడి పెరుగుతుండగా.. అసలు ఈ ఘటనల్లో రాజకీయ ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా వెల్లడి కాలేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

నిధుల వేట, మద్యం మత్తులో విధ్వంసాలు
రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలపై నమోదు చేసిన కేసుల్లో ఆరు కేసులు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో విగ్రహాల విధ్వంసానికి కారణం నిధుల కోసం సాగుతున్న వేటతో పాటు మద్యం మత్తులో ఆలయాల్లో దూరి విధ్వంసాలకు పాల్పడిన ఘటనలు ఉండటమే. ఈ ఆరు కేసుల్లో ఇప్పటివరకూ 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా తాలుపాడు వీరభద్రస్వామి ఆలయం, చిత్తూరు జిల్లా శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన విధ్వంసాలకూ ఈ కారణాలే ప్రధానంగా పోలీసులు తేల్చారు. ఇక్కడ నిధుల వేట కోసం పొరుగున ఉన్న కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు, స్ధానికంగా ఉన్న మందుబాబులే కారణమని నిర్ధారించి వీరిపై కేసులు నమోదు చేశారు.

వైసీపీ, టీడీపీ విభేదాలతో మరికొన్ని
పలు చోట్ల ఆలయాల విధ్వంసం వెనుక సదరు ఆలయ కమిటీల్లో సొంత పార్టీ వారిని తప్పించి ప్రత్యర్ధి పార్టీ వారికి పగ్గాలు అప్పజెప్పడం లేదా, ప్రత్యర్ధి పార్టీ చేతుల్లో ఉన్న ఆలయం కావడంతో అది తట్టుకోలేక విధ్వంసానికి పాల్పడిన ఘటనలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరు, శ్రీకాకుళం, కడపలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రత్యర్ధి పార్టీ నేతలను అభాసుపాలు చేయడం కోసమే కొందరు నేతలు ఇలా విధ్వంసాలకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. వారిపైనా కేసులు నమోదు చేశారు.

వ్యక్తిగత కారణాలతో విధ్వంసాలు
గతేడాది సెప్టెంబర్లో కర్నూలు జల్లా ఆళ్లగడ్డలో విగ్రహం విధ్వంసం వెనుక తన భార్య ప్రసవించడం లేదని, విగ్రహ అవశేషాలను తీసుకెళ్లి ఇంట్లో పెడితే ఫలితం ఉంటుందని నిందితుడు భావించినట్లు తేల్చారు. కర్నూల్లో మరో ల్యాండ్ సెటిల్మెంట్లో కేసును దారి మళ్లించేందుకు స్ధానికంగా ఆలయంలో విగ్రహానికి చెప్పుల దండ వేసినట్లు గుర్తించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య భూతగాదా దృష్టి మళ్లించేందుకే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చారు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో ఓ పిచ్చోడు రథాన్ని తగులబెట్టినట్లు నిర్ధారించారు. అయితే అంతర్వేది, రామతీర్ధం సహా కీలకమైన ఆలయాల్లో ఏం జరిగిందో ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది.