ఉండవల్లి మధ్యవర్తిత్వం..!! బ్రదర్ అనిల్ సుదీర్ఘ భేటీ : రహస్య అంశాలంటూ..!!
వైఎస్ షర్మిల భర్త..బ్రదర్ అనీల్ కుమార్ మాజీ ఎంపీ ఉండవల్లితో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. సడన్ గా అనిల్ రావటం...ఉండవల్లితో భేటీ అవ్వటంతో ఈ సమావేశం పైన అటు వైసీపీలోనూ..ఇటు వైఎస్సార్టీపీలోనూ ఆసక్తి మొదలైంది. వైఎస్సార్ హాయం నుంచి ఆ కుటుంబంతో ఉండవల్లికి సత్సంబంధాలు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తరువాత తొలి రోజుల్లో వైఎస్సార్ కుమారుడిగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటూ..జగన్ విజయాన్ని ఉండవల్లి అభినందించారు. ఈ మధ్య కాలంలో జగన్ నిర్ణయాల పైన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తున్నారు.

అనిల్ వ్యాఖ్యలతో రాజకీయ ఆసక్తి
అయితే, జగన్ తో ఒకటి రెండు సార్లు మినహా ఉండవల్లి ఈ మధ్య కాలంలో సమావేశం కాలేదు. ఇక, జగన్ తల్లి విజయమ్మ గత ఏడాది సెప్టెంబర్ 2ప వైఎస్సార్ వర్దంతి నాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమ్మేళనంలోనూ ఉండవల్లి పాల్గొన్నారు. ఇక, అన్న మాట కాదని.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల... రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో.. బ్రదర్ అనిల్ ఉండవల్లి అరుణ్ కుమార్ను కలిశారు. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతానని అనిల్ చెప్పకొచ్చారు. వల్లి అరుణ్ కుమార్ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.

ఉండవల్లితో చర్చించిన అంశాలేంటి
పార్టీపరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని... రాజకీయ జ్ఞానం నేర్చుకోవడం కోసమే తాను ఉండవల్లి దగ్గరకు వచ్చానని వివరించారు. అయితే, ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలు త్వరలో బయటపెడతామని.. కుటుంబానికి, రాజకీయాలకు సంబంధించిన రహస్య విషయాలు చర్చకు వచ్చాయంటూ వ్యాఖ్యానించటం ద్వారా ఇప్పుడు ఈ భేటీ పైన మరింత ఆసక్తి పెరిగింది. రాజకీయ అంశాలతో పాటుగా ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించిన అంశాలు పేర్కొనటం ద్వారా ఇప్పుడు ఇద్దరి మధ్య బేధాభిప్రాయల పైన ఉండవల్లికి మధ్యవర్తిత్వం అప్పగిస్తున్నారా అనే చర్చ మొదలైంది. వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన కేవీపీ రామచంద్రరావు సైతం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా.. ప్రస్తుతం దూరం పాటిస్తున్నారు.

రాజకీయ - కుటుంబ వ్యవహారాలంటూ
ఇక, వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదు. రాజకీయంగానూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా..అప్పుడప్పుడూ సమావేశాలకు హాజరవ్వటం మినహా యాక్టివ్ రోల్ లేదు. అయితే, అంతే సన్నిహితంగా మెలిగిన ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా... రాజకీయ వ్యవహారాల పైన మాత్రం స్పందిస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ అనిల్ కలవటం..త్వరలోనే భేటీ వివరాలు బయట పెడతానని చెప్పటం ద్వారా .. ఖచ్చితంగా ఉండవల్లితో కీలకమైన అంశాల పైనే చర్చ జరిగిందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అందునా కుటుంబ విషయాలు అని కూడా చెప్పటంతో...వీరి భేటీ పైన మరింత ఆసక్తి కనిపిస్తోంది.