ఏపీలో మరో దారుణం: అర్దరాత్రి తలుపుకొట్టి.. మహిళపై అత్యాచారం
మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా మహిళా రక్షణ ప్రశ్నగానే ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. వరుస అత్యాచార ఘటనలతో ఏపీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేపు చోటుచేసుకున్న ఘటన తర్వాత, విజయనగరంలో మహిళపై అత్యాచారం చేసి గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఇక తాజాగా రేపల్లె లో మహిళపై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. వరుసగా అనేకచోట్ల జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

తాజాగా మరో దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరంలో ఉడా కాలనీ లో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరానికి ఉపాధి కోసం వచ్చిన బాధిత మహిళ ఒక టీ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. సోమవారం అర్ధరాత్రి అగంతకుడు ఆమె ఇంటి తలుపు కొట్టాడు. ఎవరు అని తలుపు తీసి చూసిన ఆమె వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాక తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. ఈ లోపే ఆ అగంతకుడు బలవంతంగా లోపలకి చొరబడ్డాడు.
ఆపై మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వరుస ఉదంతాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజాగా మరో ఉదంతం చోటు చేసుకోవటం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారగా, వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు మహిళల రక్షణను ప్రశ్నిస్తున్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది .