ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోరు ముగిసి పోయిందనుకుంటే పొరబాటే. అసలు పోరు ఇప్పుడే మొదలైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఉంటుందని పదే పదే చెబుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవో సంచలనం రేపింది. ఇప్పటికే ఈ ఎత్తులకు కౌంటర్ సిద్ధం చేసుకున్న నిమ్మగడ్డ కూడా
మరో ఎత్తు వేసి అలాంటి పప్పులేమీ ఉడకబోవని స్పష్టం చేసేశారు. దీంతో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్ సశేషంగానే కనిపిస్తోంది.
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?

మరో పోరుకు తెరలేపిన జగన్, నిమ్మగడ్డ
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో దాదాపు ఏడాది కాలంగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్‌గా సాగిపోయిన పోరు కాస్తా ముగిసిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. పలు అభ్యంతరాలు ఉన్నా ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తామని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అనుకున్నట్లుగానే సీఎస్‌తో పాటు ఇతర అధికారులు కూడా క్రమంగా ఎస్ఈసీకి సహకరిస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్నది. కానీ లోపల స్టోరీ మరో విధంగా సాగిపోతోంది.

పంచాయతీల ఏకగ్రీవానికి సర్కారు జీవో
గతేడాది రాష్ట్రంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రత్యర్ధి పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్దులను అధికార పార్టీ బెదిరించడంతో వారు చేసేది లేక పోటీ నుంచి తప్పుకుని ఏకగ్రీవానికి సహకరించారు. దీనిపై అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత ఏకంగా ఎన్నికలే వాయిదా పడ్డాయి. ఇప్పుడు తిరిగి ఏకగ్రీవాల ద్వారానే ఎన్నికలు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించే పంచాయతీలకు జనాభా ప్రకారం తాయిలాలు ప్రకటించింది. ఈ మేరకు నిన్న జీవో జారీ చేసింది. 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకూ ఈ ప్రోత్సాహకాలున్నాయి.

ఏకగ్రీవాలకు చెక్ పెట్టేందుకు నిమ్మగడ్డ అస్త్రం
రాష్టంలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా ఐజీ స్ధాయి అధికారితో పర్యవేక్షణ చేయిస్తామని చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అనుకున్నట్లుగానే ఐజీ స్ధాయి అధికారి సంజయ్‌ను రంగంలోకి దింపారు. నిన్న రిపబ్లిక్ డే సెలవు అయినా ఐపీఎస్ డాక్టర్ సంజయ్ నిమ్మగడ్డ వద్దకు వచ్చి ఛార్జ్ తీసుకున్నారు. బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూసేందుకు సంజయ్ సేవల్ని నిమ్మగడ్డ వినియోగించుకోనున్నారు. అంటే ఇకపై ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులన్నీ సంజయ్ డీల్ చేయబోతున్నారన్నమాట. ఆయనకు సర్వాధికారాలు కట్టబెట్టడం ద్వారా బలవంతపు ఏకగ్రీవాలను తగ్గించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

ఏకగ్రీవాల చుట్టే అసలు పంచాయతీ
ఏపీలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం, బలవంతంగా జరగకుండా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించే అవకాశం ఉండటంతో అసలు పంచాయతీ ఈ విషయంలోనే అని తేలిపోయింది. దీంతో పంచాయతీ ఎన్నికల పోరు ఏకగ్రీవాల చుట్టే తిరగబోతోంది. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం బహిరంగ ప్రకటనలే ఇస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోవడం ఎస్ఈసీకి సాధ్యమైనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో వాటిని బలవంతపు ఏకగ్రీవాలుగా చూపేందుకు నిమ్మగడ్డ ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.