కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన పెను ప్రమాదం
Bhupathiraju Srinivasa Varma: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
మంత్రి శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కారును మరో ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. కారు ఇంజిన్ సీజ్ అయినట్లు తెలిసింది. కాగా, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. జాయింట్ సెక్రటరీ వెనువెంటనే మంత్రి గాయాలకు ప్రాథమిక చికిత్స చేశారు.

ఈ ప్రమాదంలో మంత్రి శ్రీనివాస వర్మ తలకు, కాలికి గాయాలయ్యాయి. రహదారిపైపై నుంచి ట్రాఫిక్ పోలీసులు కారుని పక్కకి తొలగించారు. ఆ తర్వాత కేంద్రమంత్రిని సహాయక సిబ్బంది ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు వైద్యులు చికిత్స అందించారు.
గాయాల కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని కేంద్రమంత్రికి వైద్యులు సూచించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే విజయవాడకు బయల్దేరారు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ.
తాను బాగానే ఉన్నానని, తనకు తగిలినవి స్వల్ప గాయాలేనని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. కాగా, పార్లమెంట్ సమావేశాలకుకు హోలీ పండగ సెలవులు ప్రకటించారు. మళ్లీ సోమవారం నుంచి సమావేశాలు ఉంటాయి. వరుసగా సెలవులు కావడంతో ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పార్లమెంట్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరు తప్పుదారిలో వచ్చారనేదానిపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో వెనక సీట్లో శ్రీనివాస వర్మ కూర్చుని ఉన్నారు. కేంద్రమంత్రి కావడంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications