
ఏపీ పెగాసస్ వివాదం బెంగాల్ కు వెళ్లనున్న అసెంబ్లీ కమిటీ-చంద్రబాబును పట్టుకోగలరా ?
ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసినట్లు మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని వైసీపీ సర్కార్ సభా సంఘం నియమించింది. నిన్న ఈ సభాసంఘం భేటీ కావడంతో పాటు ఇవాళ ఐటీ, హోంశాఖ అధికారుల్ని కలిసి వివరాలు సేకరించాలని నిర్ణయించింది. దీంతోపాటు బెంగాల్ కు వెళ్లబోతోంది.

పెగాసస్ లో చంద్రబాబు పాత్ర
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పెగాసస్ ప్రతినిధులు తనను కూడా సంప్రదించారని, కానీ తాను కొనుగోలు చేయలేదని ఆమె గతంలో ప్రకటించారు. దీంతో ఏపీలో చంద్రబాబు పేరు వినిపిస్తేనే కత్తులు నూరుతున్న వైసీపీ సర్కార్ కు గొప్ప ఆయుధం లభించినట్లయింది. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సీఎం జగన్.. పెగాసస్ లో చంద్రబాబు పాత్ర తేల్చాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన హౌస్ కమిటీ ఇప్పుడు ఆధారాల సేకరణ పనిలో పడింది.

ఐటీ, హోంశాఖ అధికారులతో భేటీ
ఏపీలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై వాస్తవాలు నిర్ధారించేందుకు నియమించిన అసెంబ్లీ సభా సంఘం ఆధారాల వేటలో పడింది. ఇవాళ సభా సంఘం హోంశాఖతో పాటు ఐటీ శాఖ అధికారులతో భేటీ కాబోతోంది. ఈ భేటీలో గతంలో ఏపీలో స్పైవేర్ కొనుగోలు జరిగిందా, జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరబోతోంది. దీంతో హోంశాఖ, ఐటీ అధికారులతో హౌస్ కమిటీ భేటీలోనే పెగాసస్ కు సంబంధించిన కీలక వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని అంచనా.

బెంగాల్ అసెంబ్లీ రికార్డుల పరిశీలన
ఏపీోల పెగాసస్ కొనుగోలు వివాదంపై కీలక ఆధారంగా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను సమగ్రంగా తెలుసుకునేందుకు బెంగాల్ వెళ్లి అక్కడి అసెంబ్లీ రికార్డుల్ని కూడా పరిశీలించాలని అసెంబ్లీ కమిటీ నిర్ణయించింది. దీంతో త్వరలో బెంగాల్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోనే మమతా బెనర్జీ ప్రకటన చేసినందున .. అక్కడికి వెళ్లి రికార్డులు పరిశీలిస్తే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముందని సభా సంఘం భావిస్తోంది. ఎందుకంటే అసలు మమతా బెనర్జీ అలాంటి ప్రకటనే చేయలేదని టీడీపీ వాదిస్తోంది.

చంద్రబాబును పట్టుకోగలరా ?
పెగాసస్ వివాదంపై మమతా బెనర్జీ ప్రకటన వెలువడగానే టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగింది. ఈ సందర్భంగా టీడీపీ స్పందించిన తీరుపైనా సభా సంఘం పరిశీలన చేయబోతోంది. మమతా బెనర్జీ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినట్లు వైసీపీ చెప్తుండగా.. టీడీపీ మమత చంద్రబాబు గురించి మాట్లాడలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ బెంగాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఎన్నో దర్యాప్తులు, విచారణలు జరిగినా ఒక్క అంశంలోనూ ఆయన దొరకలేదు. ఇప్పుడు పెగాసస్ విషయంలోనూ మమతా బెనర్జీ మాట్లాడినట్లు నిరూపించలేకపోతే చంద్రబాబుకు మరోసారి ఊరట కానుంది.