కూన రవిపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు : అచ్చెన్నకు మరో ఛాన్స్- నిమ్మగడ్డ విషయంలో మాత్రం..!!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో టీడీపీ నేత కూన రవికుమార్ పైన చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిద్దమైంది. ఇదే అంశం పైన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. గతంలోనే స్పీకర్ పైన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు- కూన రవికుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు జరిగే సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని అచ్చెన్నాయుడు కమిటీకి సమాచారం అందించారు.

స్పీకర్ పైన వ్యాఖ్యలు-అచ్చెన్నాయుడు గైర్హాజరు
దీంతో..తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇవ్వాలని కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరైన కూన రవి కుమార్ విషయంలో మాత్రం కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నామని కమిటీ ఛైర్మన్ కాకాకి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కూన రవిపై సీరియస్- చర్యలకు సిద్దం..
కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని సభ ముందు ఉంచుతామని వెల్లడించారు. ఇక, ఇప్పటికే ప్రివిలేజ్ నోటీసు అందుకున్న టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామానాయుడు తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కావాలని కోరారు. దీంతో.ఆయనకు సమాచారం ఇవ్వాలని కమీటీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుల పైన సమావేశంలో చర్చ జరిగింది. నాడు మంత్రులు బొత్సా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేయటం..వారి పైన చేసిన వ్యాఖ్యలతో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలోనే ప్రివిలేజ్ కమిటీ ఆయనకు నోటీసులు పంపింది.

నిమ్మగడ్డకు మరింత సమాచారం..
ఆయన పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయితే, ఆయన పదవీ విరమణ చేసినా..ప్రివిలేజ్ కమిటీ విధాన పరంగానే వ్యవహరిస్తుందని అప్పట్లోనే కమిటీ సభ్యులు స్ఫష్టం చేసారు. అయితే, తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయోనని చెప్పాలని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. ఆయన కోరిన విధంగా ఆ వివరాలు పంపుతామని కమిటీ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా వేదికగా కూన రవికుమార్ అనేక సందర్భాల్లో స్పీకర్ తమ్మినేని పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

అసెంబ్లీ సమావేశాల్లో కూన పైన నిర్ణయం..
వీటిని సీరియస్ గా తీసుకున్న అధికార పార్టీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. కమిటీ నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవటంతో ఆయన పైన చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిద్దం అవుతోంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూన రవికుమార్ పైన చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సభకు సిఫార్సు చేసే ఆలోచనలో ఉంది. కూన రవికుమార్ ప్రస్తుతం శాసనసభ సభ్యుడిగా లేరు. దీంతో ప్రివిలేజ్ కమిటీ ఏరకమైన సిఫార్సు చేస్తుంది..ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.