అసెంబ్లీలో జరిగిందిదే-స్పీకర్ తమ్మినేని క్లారిటీ-చంద్రబాబు ఎందుకేడ్చారో
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన పోరులో చంద్రబాబు ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించేలా మాట్లాడారని గతంలో ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు కూడాపెట్టుకున్నారు. దీనిపై అప్పట్లో స్పీకర్ తమ్మినేని మౌనంగా ఉండిపోయారు. ఇవాళ ఆ రోజు జరిగిన ఘటనపై తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సభలో లేని మహిళల ప్రస్తావన ఎక్కడా రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అలా చేశారో ఆయనకే తెలియాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత వ్యవహారాలను సభ ముందు పెట్టడం సరికాదన్నారు. సభలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నామన్నట్లు స్పీకర్ తెలిపారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదనడం బాధాకరమన్నారు. దీంతో ఇప్పుడు తమ్మినేని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

అసెంబ్లీలో ఆ రోజు చంద్రబాబును, ఆయన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దారుణంగా అవమానించినట్లు టీడీపీతో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి చంద్రబాబు ఎపిసోడ్ పై ఇప్పటివరకూ స్పందించని స్పీకర్ తమ్మినేని.. చంద్రబాబు తనకు రాజకీయ జీవితం ఇచ్చారని చేసిన వ్యాఖ్యలపై మాత్రం అప్పటికప్పుడే స్పందించారు. చంద్రబాబు సభలో నుంచి ఇలా వెళ్లారో లేదో దీనిపై స్పందించిన తమ్మినేని.. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబు కాదని ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. కానీ ఆ రోజు ఘటనపై మాత్రం ఇవాళ స్పందించారు.
అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్, అనంతరం ఆయన పెట్టుకున్న కన్నీళ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ స్పీకర్ తమ్మినేని క్లారిటీపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది. స్వతహాగా వైసీపీ ఎమ్మెల్యే అయిన తమ్మినేని సభలో వైసీపీని వెనకేసుకురావడంలో ఎలాంటి విచిత్రం లేదని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే స్పీకర్ వ్యాఖ్యలపై ఇప్పటివరకూ టీడీపీ అధికారికంగా మాత్రం స్పందించలేదు.