నిలకడగా స్పీకర్ తమ్మినేని ఆరోగ్యం-మెరుగైన వైద్యానికి ఆళ్లనాని ఆదేశం
తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మళ్లీ ఆరోగ్యసమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను మణిపాల్ ఆస్పత్రి డాక్టర్లు పరిశీలనలో ఉంచారు. స్పీకర్ అనారోగ్యంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీ అసెంబ్లీలో ఎప్పుడూ తన వాగ్బాణాలతో అందరి దృష్టినీ ఆకర్షించే స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్ధతకు గురయ్యారు. తాజాగా స్పీకర్‌తో పాటు ఆయన సతీమణి కరోనా బారిన పడి చికిత్స తీసుకున్నాక కోలుకున్నారు. అయితే తిరిగి జ్వరం రావడంతో స్పీకర్ తమ్మినేనిని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కరోనా తర్వాత తిరిగి ఇన్ఫెక్షన్ సోకిందా లేక ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అన్న దానిపై మణిపాల్ డాక్టర్లు పరిశీలన చేస్తున్నారు.

స్పీకర్ తమ్మినేని ఆరోగ్య పరిస్ధితిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యమంత్రి ఆళ్లనాని స్పందించారు. మణిపాల్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. తమ్మినేనికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని మణిపాల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. స్పీకర్ తమ్మినేని త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ యథావిథిగా ప్రజాసేవలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఆకాంక్షించారు.
స్పీకర్ తమ్మినేని మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు తెలియడంతో పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు. అయితే డాక్టర్లు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందని ప్రకటించారు.