andhra pradesh bjp amaravati ys jagan tdp vishnu vardhan reddy ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీడీపీ వైఎస్ జగన్ అమరావతి politics
ఆ టీవీ ఛానెల్‌పై ఏపీ బీజేపీ కన్నెర్ర... క్షమాపణ చెప్పేంతవరకూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటన...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్లో మంగళవారం(ఫిబ్రవరి 23) రాత్రి అమరావతి రాజధాని అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం పెద్ద దుమారానికే తెరలేపింది. డిబేట్ సందర్భంగా ఆగ్రహావేశానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని కించపరుస్తున్నవాళ్లకు ఇది తగిన శాస్తి అని కొందరు అభిప్రాయపడుతుంటే... ఇలాంటి చర్యలు సహేతుకం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొలికపూడి శ్రీనివాసరావును మరోసారి స్టూడియోకి పిలిచి వివరణ కోరింది ఏబీఎన్. ఈ పరిణామానికి తీవ్రంగా నొచ్చుకున్న బీజేపీ... ఇకపై ఆ టీవీ ఛానెల్‌ను,పేపర్‌ను బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
పత్రికా ప్రమాణాలు,టీవీ ఛానెల్ నైతిక విలువలను గాలికొదిలేసి టీడీపీ కరపత్రికగా,ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా.. మళ్లీ ఆయన్ను చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని పేర్కొంది.

మీడియా ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవి ఛానెల్,పేపర్‌ను ఇకపై బీజేపీ విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని నిర్ణయించినట్లు వెల్లడించింది. అలాగే ఆ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ.. తమకు నచ్చినవారిని టీవీ ఛానెల్‌కు పిలిచి పార్టీ వాయిస్‌గా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఈ బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
మరోవైపు బుధవారం(ఫిబ్రవరి 24) ఏబీఎన్ స్టూడియోకి వచ్చిన కొలికిపూడి శ్రీనివాసరావు.. విష్ణు వర్దన్‌పై దాడి దురదృష్టకర ఘటన అన్నారు. తానెవరో తెలియదని స్వయంగా చెప్పిన విష్ణువర్దన్ రెడ్డి తనను టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు అనడం,రైతు ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహావేశానికి గురైనట్లు చెప్పారు. అయినప్పటికీ ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని భావిస్తున్నానని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినా తిరస్కరించినట్లు చెప్పారు. ఒకప్పుడు ప్రొఫెసర్ కోదండరాం,మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్‌లతో కలిసి పనిచేసిన నేపథ్యం తనదని తెలిపారు. లక్షల రూపాయలు సంపాదించే ఐఏఎస్ కోచింగ్ అకాడమీని పక్కనపెట్టి రైతుల కోసం ఉద్యమంలోకి వచ్చానని తెలిపారు. రైతుల త్యాగాలను ఎవరూ అవమానించవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు.
అధికార ప్రకటన
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 24, 2021
పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నది. pic.twitter.com/aUe0YwuNcW