అందివచ్చిన అవకాశం: సీమ జిల్లాల్లో కాషాయ జెండా: 4 రోజులు టూర్: 22న భారీ బహిరంగ సభ
కర్నూలు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు.. రాయలసీమ జిల్లాలపై దృష్టి సారించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని పార్టీని క్రీయాశీలకంగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి ఉన్నంత పట్టు సీమ జిల్లాల్లో బీజేపీకి లేదు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ కూడా కొంత బలహీనడపడినట్టు కనిపించడంతో- ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నారు.

సీమపై ఫోకస్..
అందివచ్చిన అవకాశాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మత కలహాలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న ఆత్మకూరు ఘటనను ప్రాతిపదికగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీన్ని అజెండా తీసుకుని జనంలోకి వెళ్లాలనేది బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల కార్యాచరణ ప్రణాళికగా చెబుతున్నారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. తమకు పట్టు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడం వల్ల గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్‌ను క్రియాశీలకం చేసినట్టవుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

కర్నూలుకు చేరుకున్న సోము
నాలుగు రోజుల పాటు వారు విసృతంగా పర్యటించనున్నారు. రాయలసీమ జిల్లాల పర్యటన కోసం బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సాయంత్రమే కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పార్లమెంట్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మకూరు సంఘటన, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నన రాజకీయ పరిస్థితులు, దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో..
ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, ఎస్ విష్ణుకుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవ్వాళ సోము వీర్రాజు కర్నూలులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే సమావేశాలకు హాజరు కానున్నారు. ఆర్ఎస్ఎస్ తలపెట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో సోమూవీర్రాజు పర్యటించనున్నారు.

అనంతపురంలో పర్యటన..
బనగాన పల్లెకు చెందిన బీజేపీ నాయకుడు సుజన్ పురోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నంద్యాలలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుజన్ పురోహిత్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. 20వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ జిల్లాల నాయకులతో సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

జగన్ సర్కార్ టార్గెట్..
పార్టీ బలంగా ఉన్న హిందూపురం పార్లమెంట్ జిల్లాలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారు. 21వ తేదీన కర్నూలు జిల్లా గూడూరుకు వెళ్తారు. పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22వ తేదీన కర్నూలులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతోందని, అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తోందని బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తుగ్లక్ పరిపాలనను తలపిస్తోందని ఆరోపిస్తోంది. హిందువులను అణచివేస్తోందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.