విడిపోయి6ఏళ్లు,తెలంగాణలో ఏపీ ఆస్తులెన్ని? కేసీఆర్‌తో డీలింగ్‌లో చంద్రబాబు-జగన్ సేమ్.. బీజేపీ ఫైర్..
తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు శుభాభినందనలు వెల్లువెత్తాయి. విభజన గాయాలను ఇంకా మర్చిపోని ఏపీ నేతలెవరూ విషెస్ చెప్పలేదు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా శుభసందేశాలు పంపారు. జాతీయ పార్టీ బీజేపీ.. తెలంగాణ శాఖ సంబురాలు చేసుకుంటుండగా, ఏపీ శాఖ మాత్రం రెండు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..

ఆస్తుల మాటేంటి?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు.. అంటే, 2024 వరకు ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరేళ్లలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఏపీ పాలకులు హైదరాబాద్ కు పూర్తిగా దూరం కావడం, అమరావతిలో కొత్త రాజధాని ఏర్పాటు చేయడం, మళ్లీ ఇప్పుడుదాన్ని విశాఖపట్నంకు తరలిపోనుండటం తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తుల మాటేమిటనే ప్రశ్నను బీజేపీ లేవనెత్తింది. తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం కోసం.. ఏపీ ప్రభుత్వం.. హైదరాబాద్ లోని తన భవనాలను వదులుకున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో దొందూదొందే
ఏపీకి సంబంధించి తెలంగాణలో.. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వంగానీ, ప్రస్తుత వైసీపీ సర్కారుగానీ కన్వీనియంట్ గా దాటవేట ధోరణి ప్రదర్శిచాయని, చంద్రబాబు-జగన్ దొందూదొందే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుల ఫొటోలతో కన్నా ఓ సంచలన ట్వీట్ చేశారు.

ఓటుకు నోటు.. స్వార్థప్రయోజనాలు..
నాటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ తీసుకున్న చంద్రబాబు.. వేలకోట్ల రూపాయల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలి కరకట్టకు వచ్చిచేరారని కన్నా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ఆస్తుల విషయంపైదృష్టి సారిస్తుందనుకుంటే.. సీఎం జగన్ తన స్వార్థప్రయోజనాల కోసం కేసీఆర్ తో కలిసిపోయారని, ఏపీ ఆస్తులపై నోరు మెదపకపోగా, ఉన్నవాటిని తెలంగాణకు అప్పగించేశారని ఆరోపించారు. అసలు చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

కేంద్రం సొమ్ముతో జగన్ సంబురాలా?
జగన్ ఏడాది పాలన సంబురాలపై ఏపీ బీజేపీకే చెందిన మరో కీలక నేత విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక అడుగు ముందుకు పడితే.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా రాష్ట్రం పరిస్థితి తయారైందని, రివర్స్ టెండరింగ్ కారణంగా దాదాపు అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయని, గత ప్రభుత్వంలో కేటాయింపు పత్రాలు పొందినవారికి ఇప్పటిదాకా ఇళ్లు దక్కలేదని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.10 వేలకు ‘జగనన్న తోడు'గా పేరు మార్చి ఏపీ సర్కారు క్రెడిట్ కొట్టేస్తోందని ఆయన మండిపడ్డారు.

వాలంటీర్లకు రూ.10వేలు..
ఓవైపు జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే, వాలంటీర్ల వ్యవస్థను విష్ణుకుమార్ రాజు అభినందించారు. అయితే రోజంతా కష్టపడుతోన్న వాలంటీర్లకు ఇప్పుడిస్తున్నట్లు రూ.5వేలు కాకుండా నెలకు రూ.10వేలు జీతం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కాలంలో అన్న క్యాంటీట్లు తెరిచి ఉంటే, పేదలకు ఆకలి బాధలు తప్పేవని, ఇప్పటికైనా కనీసం ‘జగనన్న క్యాంటీన్'పేరుతోనైనా వాటిని తెరవాలని విష్ణుకుమార్ డిమండ్ చేశారు.