వరద బాధితుల కోసం రంగంలోకి ఏపీ బీజేపీ; జోలె పట్టి విరాళాల సేకరణకు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఐదు జిల్లాల్లో అపారం ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. భారీ వర్షాలకు పెన్నా దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆనకట్టలు తెగిపోయాయి. జలప్రళయం ఒక్కసారిగా గ్రామాల మీదకు వచ్చి పడడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
నిలువ నీడ లేని పరిస్థితులలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వరద బాధితులకు అందుతున్న సహాయం కూడా అంతంతమాత్రంగా మారింది. దీంతో రాయలసీమ జిల్లాలలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.

వరద బాధితుల కోసం రంగంలోకి ఏపీ బీజేపీ
భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించిన బిజెపి వరద బాధితుల సహాయార్థం జోలిపట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వరద బాధితులకు సహాయం అందించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. వరద ప్రభావిత జిల్లాల్లో బాధితులను ఆదుకోవడం కోసం ఈనెల 25, 26 తేదీలలో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించాలని నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రజలనుంచి సేకరించిన విరాళాలను వరద బాధితులకు అందిస్తామని, విరాళాల సేకరణ కార్యక్రమం కారణంగా ఈనెల 26వ తేదీన జరగాల్సిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ భేటీని వాయిదా వేస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల ప్రజల ఇబ్బందులను చూసి ఏపీ బీజేపీ నేతలే కాకుండా, తెలంగాణ బిజెపి నేతలు కూడా స్పందిస్తున్నారు.

ఏపీ వరదలపై స్పందిస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎడతెరిపి లేని వర్షాలతో కన్నీటి కడలిగా మారిన ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల బాధ చూస్తుంటే గుండె బరువెక్కుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో దిక్కుతోచక స్తంభించిపోయిన జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అంటూ బిజెపి సీనియర్ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న వరదలలో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉంది. ఇక ఆ బాధ్యతను ప్రభుత్వంతో పాటుగా, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వర్తిస్తే కొంత మేరకు వరద బాధితులకు ఉపశమనం కలిగించిన వాళ్ళవుతారు.

వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన టీడీపీ
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ ట్రస్ట్ సేనలు రంగంలోకి దిగి వరద బాధిత కుటుంబాలకు ఆహారం, మందులు సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందించడానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉందని చెబుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారికి కావలసిన సహాయాన్ని తెలుగుదేశం పార్టీ నుండి అందించేందుకు శ్రేణులకు ఆదేశాలిచ్చారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు
మంగళవారం నాడు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బాధిత కుటుంబాల ఇబ్బందులను తెలుసుకున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ను పరిశీలించిన చంద్రబాబు ప్రాజెక్టులు తెగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యం తో పాటు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణమని పేర్కొన్నారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలను అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక ఈరోజు రేపు కూడా చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.