ఎన్డీయేలోకి వైసీపీ చేరిక-కేంద్రమంత్రి ప్రతిపాదనతో మళ్లీ చర్చ-బీజేపీ రియాక్షన్ ఇదే
ఏపీలో అధికార వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో చేరాలంటూ ఇప్పటికే ఈ రెండేళ్లలో పలు ఆహ్వానాలు అందాయి. వీటిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీకి తాజాగా మరో ప్రతిపాదన అందింది. తాజాగా విశాఖలో పర్యటించిన కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా విశాఖ వచ్చిన కేంద్రమంత్రి ఈ ప్రతిపాదన చేసే సరికి కొత్త చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ కూడా స్పందించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్డీయేలోకి వైసీపీ చేరిక
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రెండేళ్లుగా ఎన్డీయేలో చేరాలంటూ పలు ఆహ్వానాలు అందుతువ్నాయి. ముఖ్యంగా 2019కి ముందు వైసీపీని లైట్ తీసుకున్న బీజేపీ, ఎన్డీయే ఓసారి అధికారం చేపట్టిన తర్వాత మాత్రం జగన్ ను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టేశాయి. ఇదే క్రమంలో జగన్ డిమాండ్లను పట్టించుకోకపోయినా ఎన్డీయేలోకి రావలంటూ ఆయనకు ఆఫర్లు ఇవ్వడం మాత్రం మానలేదు. ఇదే క్రమంలో గతంలో చేసిన పలు ప్రతిపాదనల్ని సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. నేరుగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా కోరినా జగన్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు.

కీలక పదవులు ఇస్తామన్నా..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎలాంటి ఇబ్బందిలేకుండా రాజకీయంగా సహకరిస్తున్న వైసీపీని నేరుగా తమ కూటమిలోకి చేర్చుకుంటే ఇక భవిష్యత్తులోనూ ఎలాంటి ఢోకా ఉండబోదని ఎన్డీయే భావించింది. ఈ క్రమంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ లేదా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవుల్ని ఆశ చూపింది. కానీ వైసీపీ మాత్రం లొంగలేదు. అందుకు వైసీపీకి ఉండాల్సిన కారణాలు ఉండనే ఉన్నాయి. దీంతో కీలక పదవుల్ని ఆశచూపుతున్నా కేంద్రంలో చేరేందుకు మాత్రం వైసీపీ మాత్రం మొగ్గు చూపడం లేదు. అయినా ఎన్డీయే కూటమిలోని నేతలకు ఆశ చావనట్లే కనిపిస్తోంది.

జగన్ ను వెంటాడుతున్న చంద్రబాబు గతం
వైసీపీని ఎన్డీయేలోకి రావాలని పలు ఆహ్వానాలు లభిస్తున్నా అధినేత జగన్ మాత్రం ముందుకు రావడం లేదు. ఇందుకు పలు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది బీజేపీ లేదా ఎన్డీయే మిత్రపక్షాల ఓటు బ్యాంకుకూ, తన ఓటు బ్యాంకుకూ మధ్య ఉన్న వైరుధ్యమే. ముఖ్యంగా బలమైన మైనార్టీ ఓటు బ్యాంకు కలిగిన వైసీపీ.. ఇప్పుడు ఎన్డీయేలో చేరితే అది కాస్తా చెల్లాచెదురు కావడం ఖాయం. దీంతో ఎన్డీయేకు దూరంగా ఉంటూనే అవసరాల రీత్యా సాయం చేసేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో గతంలో ఎన్డీయేలో చేరి చంద్రబాబు కొని తెచ్చుకున్న సమస్యలు కూడా జగన్ ను ఆలోచనలో పడేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఎన్డీయేకు దూరంగా ఉండిపోతున్నారు.

కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలతో..
ఇప్పటికే పలుమార్లు ఎన్డీయేలో చేరాలంటూ వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తూ వస్తున్న జగన్ కు తాజాగా కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే మరోసారి ప్రతిపాదన చేశారు. ఎన్డీయేలోకి వైసీపీని ఆహ్వానిస్తూ ఆయన విశాఖ పర్యటన సందర్భంగా చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికప్పుడు జగన్ తో ఎన్డీయేకు వచ్చిన అవసరాలేవీ లేవు. అలాగని జగన్ కూడా ఎన్డీయేకు దూరంగా జరిగేందుకు ఇష్టపడటం లేదు ఇలాంటి సమయంలో ఎన్డీయేలోకి మరోసారి జగన్ ను ఆహ్వానిస్తూ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఏపీ బీజేపీ రియాక్షన్
వైసీపీని ఎన్జీయేలోకి ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రతిపాదనపై ఏపీ బీజేపీ స్పందించింది. బీజేపీ నేత లంకా దినకర్ జగన్ కేంద్రమంత్రి అథవాలే ఇచ్చిన ఆఫర్ పై మండిపడ్డారు. అథవాలే అతిగా మాట్లాడుతున్నారని, వైసీపీతో వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను పక్కదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకూడదంటూ అథవాలేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో ఎన్డీయేలోకి జగన్ ను అహ్వానిస్తూ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేనా అన్న చర్చ జరుగుతోంది.

వైసీపీ వ్యూహాత్మక మౌనం ?
ఎన్డీయేలో వైసీపీ చేరిక కోసం ఆఫర్లు వస్తున్నా, కీలక పదవులు ఆశ చూపుతున్నా వైసీపీ మాత్రం స్పందించడం లేదు. కేంద్రంలో మోడీ, అమిత్ షాకు చెప్పాల్సిన విషయాలు ఎలాగో చెప్పేస్తున్నాం కాబట్టి దీనిపై బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదనేది వైసీపీ వాదన. అయితే వైసీపీ మౌనంగా ఉంటున్న కేంద్రమంత్రులతో పాటు ఎన్డీయేకూ, వైసీపీకి మధ్యవర్తులుగా ఉన్న వారు కూడా దీనిపై ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు.
అదే సమయంలో ఏపీ బీజేపీ మాత్రం వైసీపీతో జట్టు కట్టేందుకు ససేమిరా అంటోంది. కేంద్రంలో తప్పనిసరి పరిస్ధితుల్లో వైసీపీ చేరితే మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతవరకూ తమ స్టాండ్ మారబోందంటున్నారు.