సభా సమయం: మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..? 9న పద్దు ప్రవేశపెట్టనున్న బుగ్గన..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత బడ్జెట్ సెషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును ఈ నెల 27వ తేదీన రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదు. దీంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టిసారించింది.

6న బడ్జెట్..?
మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 6వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదావేసి.. మార్చి 9వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్ సమావేశాలపై మార్చి 4వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. సమావేశాల తేదీని ఖరారు చేస్తారు.

9న ఎందుకంటే..
6న గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలను వాయిదా వేస్తారు. 9వ తేదీన మంచి ముహూర్తం ఉందని పండితులు చెప్పారు. ఆ రోజే మంచిరోజు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి పద్దును ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను కురసాల కన్నబాబు ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీరిద్దరూ మండలిలోనూ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

తేలని రిజర్వేషన్..
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అనుకొంది. ఈ నెల 10వ తేదీన జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని సీఎం జగన్ భావించారు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్‌పై ఫిబ్రవరి 27వ తేదీన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్ ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కసరత్తు కూడా చేస్తోంది.