andhra pradesh amaravati ap cabinet ap assembly resolution Visakhapatnam Steel Plant loans ap news ap govt ys jagan ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏపీ అసెంబ్లీ తీర్మానం రుణాలు ఏపీ ప్రభుత్వం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ తీర్మానం, అమరావతి పూర్తికి రుణాల హామీ
ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం, అమరావతి నిర్మాణాల పూర్తికి ఏఎంఆర్డీయేకు బ్యాంకు రుణాల గ్యారంటీ ఇవ్వడం, ఈ ఏడాదికి నవరత్నాల క్యాలెండర్ అమలు, పేదల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో కొత్తగా అమల్లోకి తెస్తున్న ఈబీసీ నేస్తం పథకం కూడా ఉంది.కాకినాడ సెజ్‌పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కూడా కేబినెట్ ఆమోదించింది.

వైజాగ్ స్టీల్‌పై అసెంబ్లీ తీర్మానం
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ కాక రేపుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ నుంచి ఓ తీర్మానం చేసి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ప్రధానికి జగన్ ఈ విషయంపై లేఖ రాశారని, కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అసెంబ్లీ తీర్మానం కూడా చేస్తామని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిశాక అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం ఆమోదిస్తారు.

ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ పచ్చజెండా
ఏపీలో అగ్రవర్ణాల్లో పేదలుగా ఉన్న వారికి, ఎలాంటి రిజర్వేషన్లు లేని వారి కోసం ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ పథకానికి కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం రూ.670 కోట్లతో అగ్రవర్ణ పేద మహిళలకు లబ్ది చేకూరుస్తారు. ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఒక్కొక్కరికీ ఏడాదికి 15 వేలు ఇవ్వనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ పథకం కింద లబ్దిదారులకు డబ్బులు అందజేస్తారు.

నవరత్నాల సంక్షేమ క్యాలెండర్‌కు ఆమోదం
ఈ ఆర్ధిక సంవత్సరంలో నవరత్నాల క్యాలెండర్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏప్రిల్‌లో వసతి దీవెన నుంచి ప్రారంభించి మొత్తం 23 పథకాలను ఇందులో భాగంగా అమలు చేస్తారు. ఇందులో జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక, రైతులకు వడ్డీలేని రుణాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, పంటల బీమా చెల్లింపు, రైతు భరోసా, మత్స భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహనమిత్ర, కాపునేస్తం, రైతులకు వడ్డీలేని రుణాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, ఈబీసీ నేస్తం, అమ్మఒడి పథకం వంటి పథకాలు ఇందులో ఉన్నాయి.

పేదల ఇళ్లకు కేబినెట్ నిర్ణయాలు
పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగుల వరకూ రూపాయికే టిడ్కో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.300 చదరపు అడుగులు దాటితే కట్టాల్సిన రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు లే అవుట్లలో 5 శాతం భూమి పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమి ప్రభుత్వానికి బదలాయించాలని ఆదేశాలు ఇవ్వనున్నారు.ఇప్పటికే పలు పథకాల కింద లబ్దిదారుల నుంచి సేకరించిన రూ.50 వేల వరకూ మొత్తాల్ని వారికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు.

కాకినాడ సెజ్ భూములు వెనక్కి, ఇతర నిర్ణయాలు
కాకినాడ సెజ్‌పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను మంత్రి కన్నబాబు నేతృత్వంలోని కమిటీ కేబినెట్‌కు అందజేసింది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రైతులు ఇచ్చిన 2180 ఎకరాలను వెనక్కి ఇచ్చేయాలని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ముద్దనూరులో కొత్త అగ్నిమాపక కేంద్రం, సిబ్బంది కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పెనుమూరు, కార్వేటినగరంలో పీహెచ్‌సీలను 50 పడకల ఆస్పత్రులకు అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ మేరకు వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కడపలో వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వ భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.