ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-ఇక కోనసీమ అంబేద్కర్ జిల్లా-అదానీ గ్రీన్ ఎనర్జీకి ప్రాజెక్టుకు ఓకే
ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశమైంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల మొత్తాల విడుదల, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, కోనసీమ జిల్లా పేరు మార్పు వంటి కీలక అంశాలపై చర్చించింది. అలాగే రాష్ట్రంలో కొత్తగాపెట్టే ప్రాజెక్టుకు భూముల కేటాయింపుతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 42 అంశాలకు ఆమోద ముద్ర పడింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వెలగపూడి సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ జరిగింది. అజెండాలో ఉన్న 42 అంశాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. వీటిలో పలు సంక్షేమ పథకాలు, భూకేటాయింపులు, ఇతరత్రా అంశాలు కూడా ఉన్నాయి.

కోనసీమ జిల్లా పేరు మార్పు
రాష్ట్రంలో జిల్లాల విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జోడిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై కోనసీమలో ఆందోళనలు చెలరేగి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టే వరకూ పరిస్ధితులు వెళ్లాయి. అయినా దీనిపై వెనక్కి తగ్గరాదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై అంబేద్కర్ కోనసీమ జిల్లాగా దీన్ని పిలవాల్సి ఉంటుంది.

సంక్షేమ మొత్తాల విడుదల
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఈ ఏడాది ఇవ్వాల్సిన మొత్తాలను జూన్-జూలైలో విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందులో అమ్మఒడితో పాటు పలు సంక్షేమ పథకాలు ఉన్నాయి. అమ్మఒడి పథకం మూడో విడత మొత్తాన్ని ఈ నెల 27న ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జూలైలో వాహనమిత్ర, జననన్న విద్యాకానుక, కాపునేస్తం పథకాలు ఉన్నాయి. వీటి మొత్తాల విడుదలకు కేబినెట్ ఆమోదించింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 వేల ఖర్చుతో అదానీ గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. అలాగే వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో 3,530 ఉద్యోగాలను పలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల లో భర్తీ కి ఆమోదం తెలిపింది. మరోవైపు దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.