ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక పురోగతికి ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ( జూన్ 25, 2025 ) జరిగిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ వ్యాఖ్యలకి వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు ఫిక్కీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో దావోస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులకు హాజరై రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషిచేశానని గుర్తుచేశారు. అప్పట్లో వ్యాపారవేత్తలతో రాజకీయ నేతలు మాట్లాడటానికే వెనుకంజ వేసిన పరిస్థితుల్లోనూ తాను ముందడుగు వేసినట్టు తెలిపారు. "ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నా సరే, పెట్టుబడుల కోసం కృషి చేశా" అని స్పష్టం చేశారు.
అలానే తాను మూడు దశాబ్దాలుగా టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పని చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను తీసుకురాగలిగానని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ ఊహించని స్థాయిలో మారిపోతూ ఉందని.. ఆ మార్పుకు అనుగుణంగా మనం ముందుకు సాగాలని ఆయన సూచించారు.

అమరావతి - గ్రీన్ ఫీల్డ్ విజన్..
చంద్రబాబు అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివర్ణిస్తూ, త్వరలో అది ప్రపంచంలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరుతుందని తెలిపారు. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే.. అమరావతి గ్రీన్ ఫీల్డ్ విజన్ అని స్పష్టం చేశారు. ఇది ఎంతో వైజ్ఞానికంగా, భవిష్యత్తు దృష్టితో నిర్మించబోతున్న ఒక అద్భుత నగరం అవుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
దేశం ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వేగంగా ఆర్థికంగా ఎదుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ఇది ఒక కాంపిటీటివ్ ఎకానమీ. అందులో మన రాష్ట్రం ముందు వరుసలో ఉండాలంటే పరిశ్రమల అభివృద్ధి అవసరం," అని చెప్పారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలే ఫిక్కీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు నచ్చాయని, వారి నుంచి వస్తున్న అభినందనలు ప్రభుత్వ దిశలోని చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్-2025లో చంద్రబాబు గారు మాట్లాడుతూ... ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుని రియల్ టైమ్ లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని... ప్రజారోగ్యానికి సంబంధించి ఈ విషయంలో బిల్ గేట్స్ తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.… pic.twitter.com/ICAKaZgyHu
— Telugu Desam Party (@JaiTDP) June 25, 2025
మరోవైపు ఈ సమావేశంలో ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం చూపుతున్న ప్రోత్సాహం అభినందనీయం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న "స్వర్ణాంధ్ర విజన్ 2047" ను సాకారం చేసేందుకు తమవంతు మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications