250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న సీఎం చంద్రబాబు .. 15 లక్షలు టార్గెట్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు నడుం కట్టారు. పీ4 (జీరో పావర్టీ - P4) కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు.
పీ4 కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు మద్దతు ఇచ్చేలా చేయాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలను కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములు చేయాలని దిశానిర్దేశం చేశారు. బంగారు కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. రాష్ట్ర ప్రజలందరూ ఈ మహత్తర యజ్ఞంలో మమేకం కావాలని చంద్రబాబు కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

250 కుటుంబాలను దత్తత..
అయితే సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తన కుటుంబసభ్యులూ మార్గదర్శులుగా భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
15 లక్షల బంగారు కుటుంబాలు టార్గెట్..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సాధికారత సాధించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, ఆ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు.. స్థానిక 'బంగారు కుటుంబాలను' దత్తత తీసుకునేలా సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బంగారు కుటుంబాల అవసరాలపై జరుగుతున్న సర్వేను ఆగస్టు 10 లోపు పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను 'మార్గదర్శులు' దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు.
కాగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా.. 57,503 మంది మార్గదర్శులుగా నమోదు అయ్యారని అధికారులు స్పష్టం చేశారు. లక్ష్యం పూర్తవ్వాలంటే మరో 2 లక్షల మార్గదర్శులు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పల్నాడు జిల్లాలో అత్యధిక బంగారు కుటుంబాల దత్తత జరగగా.. విశాఖపట్నం జిల్లా చివరలో ఉందని పేర్కొన్నారు. దత్తత కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నామని తెలిపారు. పీ4 కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రత్యేక ప్రమోషన్ చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
ప్రతిష్టాత్మక ‘‘పీ4’’ పథకంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ‘‘పీ4’’ పథకం లోగోను ఆవిష్కరించారు.… pic.twitter.com/pEczd9zz60
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 25, 2025












Click it and Unblock the Notifications