కరోనాపై నిర్లక్ష్యం వీడండి- వైరస్‌తో జీవించాల్సిందే- అధికారులతో జగన్ వ్యాఖ్యలు
ఏపీలో కరోనా పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా భారీగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణ చర్యల్లో అధికారులు తగినంత చొరవ చూపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తాజాగా నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ కరోనాపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులకు సూచించారు.
బీజేపీ కోర్కెలు తీర్చేస్తున్న జగన్- కాషాయ నేతల్లో ఉత్సాహం- అసలు వ్యూహమిదేనా.. !
ఏపీలో కరోనా నియంత్రణ చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ సూచించారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్ధితులు ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఉదాసీనత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, బోధనాసుత్రుల్లోనూ కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. కరోనా పరీక్షల కోసం ఎక్కడికెళ్లాలో అర్ధం కాని పరిస్ధితులు రాష్ట్రంలో ఉండకూడదని అధికారులకు జగన్ స్పష్టం చేశారు.

కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవడంతో పాటు ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ అధికారులకు సూచించారు.
ఈ కాల్ నంబర్ నుంచి కలెక్టర్లకు విజ్ఞప్తులు వస్తే తక్షణం స్పందించాలన్నారు. కలెక్టర్లు, జేసీలు రోజూ కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి వాటి పనితీరును పరీక్షించాలని జగన్ సలహా ఇచ్చారు.

ఆర్టిపిసిఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటల్లో, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు. కిట్లు లేవనే కారణంతో ఎక్కడా పరీక్షలు నిరాకరించరాదన్నారు. పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లుగా ఉన్న వారిని కచ్చితంగా హోమ్ క్వారంటైన్లో ఉంచాలన్నారు. 17 వేల మంది డాక్టర్లు, మరో 11 వేల మంది ట్రైనీ నర్సులను తీసుకునేందుకు అనుమతిచ్చామని, త్వరలో వాటి నియామకం పూర్తి చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.