ఆందోళనల వేళ, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన - కీలక అంశాలివే - వీలైతే ప్రధాని మోదీతోనూ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి నివేదికలు, నివేదనలు సమర్పించనున్న ఆయన.. సమయానుకూలతను బట్టి ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం ఢిల్లీకి పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ బిల్లులపై విపక్షాలన్నీ ఒక్కటై దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఆందోళనలు నిర్వహిస్తున్నవేళ ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది.
సుమేధా మృతి ఘటనలో సంచలనం - నేరపూరిత హత్య - మంత్రి కేటీఆర్‌పై పాప తల్లిదండ్రుల ఫిర్యాదు

రెండు రోజులు ఢిల్లీలోనే మకాం..
మంగళవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం జగన్.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. గత పర్యటనలకు భిన్నంగా ఈ సారి ఆయన రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అపాయింట్మెంట్లు కొరినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతోనూ సమావేశం అయ్యేదుకు సీఎం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే

కీలక అంశాలివే..
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ పరిహారం, కొవిడ్ నియంత్రణ, పోలవరం ప్రాజెక్టు, ఉపాధిహామీ పథకం నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర మంత్రులకు వివరించే అవకాశముంది. మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ ఇటీవల అఫిడవిట్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపైనా చర్చించే అవకాశమందని తెలుస్తోంది.

మోదీకి అండగా జగన్..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పార్లమెంటు లోపల, బయటా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న దరిమిలా వైసీపీ వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు వ్యవసాయ బిల్లులకు ఎన్డీఏలోని పార్టీల నుంచే వ్యతిరేకత వ్యక్తమైనవేళ.. వైసీపీ మాత్రం లోక్ సభ, రాజ్యసభలో బిల్లులకు మద్దతు పలకడం తెలిసిందే. వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని దళారీ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం రాజ్యసభలో దుమారం రేపింది. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లులపై సంతకాలు చేయొద్దంటూ రాష్ట్రపతికి లేఖలు రాసిన 15 పార్టీలు.. రాబోయే వారమంతా ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఏపీ సీఎం ఢిల్లీకి వెళుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.