ఢిల్లీకి సీఎం జగన్: ప్రధాని మోడీ-అమిత్‌షాలతో భేటీ: జమిలి ఎన్నికలపై చర్చ?
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీతో భేటీ ఆసక్తికరంగా మారనుంది. ఏపీలో ప్రస్తుత పరిణామాలను ప్రధాని మోడీకి వివరించనున్నారు ముఖ్యమంత్రి జగన్.
Nagarjuna Sagar ఉపఎన్నిక: బరిలో మెగాస్టార్ బంధువు.. కేసీఆర్ పక్కా స్కెచ్..వర్కౌట్ అవుతుందా..?

ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా రాజకీయాలు విగ్రహాల ధ్వంసం చుట్టూ తిరిగాయి. విగ్రహాలు ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు అధికార పక్షంపై నిప్పులు చెరిగాయి. రామతీర్థంలో జరిగిన రాముడి విగ్రహం ధ్వంసంపై ఇటు టీడీపీ అటు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అయితే విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిని విషయం తెలిసిందే. విగ్రహాల ధ్వంసంలో కుట్ర కోణం ఉందని డీజీపీ గౌతం సవాంగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టీడీపీ, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనిపై బీజేపీ మరోసారి డీజీపీ సవాంగ్ పై భగ్గుమంది. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

విగ్రహాల ధ్వంసంపై ప్రధానికి రిపోర్టు
విగ్రహాల ధ్వంసంకు సంబంధించి పూర్తి నివేదికను ప్రధాని మోడీకి అందజేయనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారు. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోడీతో సమావేశం అవ్వాల్సి ఉండగా... ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఇక కేంద్రహోంమంత్రి అమిత్ షాకు అపాయింట్మెంట్ దొరికితే ప్రధానికి ఏపీలో జరిగిన ఆలయాల దాడులు, విగ్రహాల ధ్వంసాలకు సంబంధించి సీఐడీ రిపోర్టును వారికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరింది ఏపీ సర్కార్. దీన్ని వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాల ధ్వంసంకు సంబంధించి ఆ కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయపార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం.

జమిలి పై క్లారిటీ ఇవ్వనున్న జగన్
ఇక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ-అమిత్ షాలతో భేటీ సందర్భంగా జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా రానున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలపై సీఎం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని కేంద్ర పెద్దల ముందు స్పష్టం చేసే అవకాశాలున్నాయి. ఇది పక్కనబెడితే సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, అదే సమయంలో కేంద్ర ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తయ్యేలా నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు యువనేత.
మొత్తానికి చాలా కాలం తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో కేంద్రం నుంచి ఏమేరకు నిధులు రాబడుతారా అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది.