జగన్ సొంత కంపెనీకే భారీగా ప్రభుత్వ ఆర్డర్లు: ఏం జరుగుతోంది? ఆ ఆరోపణలు నిజమేనా?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త విమర్శలకు కేంద్రబిందువు కాబోతోన్నారా?, మొన్నటిదాకా దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరికి గురైన జగన్ సర్కార్‌పై సరికొత్త ఆరోపణలను సంధించడానికి రాజకీయ ప్రత్యర్థులు సన్నాహాలు చేస్తున్నారా?, తాజా రాజకీయ దుమారానికి ఆయన సొంత కంపెనీ భారతి సిమెంట్స్ ఎపిసెంటర్‌గా మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం తరఫున భారీగా ఆర్డర్లను ఇవ్వడమే దీనికి కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రామతీర్థం చుట్టూ మరో వివాదం: జగన్ సర్కార్‌పై విమర్శలకు టీడీపీ మళ్లీ అవకాశం దొరికినట్టే

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు..
భారతి సిమెంట్స్.. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన కంపెనీ. ఆయన భార్య వైఎస్ భారతి ఈ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సిమెంట్ కంపెనీలో ఆమెకు 49 శాతం స్టేక్ ఉంది. మిగిలిన 51 శాతం భాగస్వామ్యం.. వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద ఉంది. ఈ కంపెనీకి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను దోచి పెట్టిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలు నిజం అనిపించేలా ఉన్నాయంటూ ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొన్ని కీలకాంశాలను ఇందులో పొందుపరిచింది.

2,28,370.14 మెట్రిక్ టన్నుల ఆర్డర్లు..
భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం తరఫున భారీగా ఆర్డర్లు వెళ్లాయని ఆ కథనం పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 18వ తేదీ మధ్యకాలంలో 2,28,370.14 మెట్రిక్ టన్నుల ఆర్డర్లు ప్రభుత్వం నుంచి వెళ్లాయని స్పష్టం చేసింది. మొత్తం 14 శాతం మేర ఆర్డర్లు ఈ ఒక్క కంపెనీకే వెళ్లాయని వివరించింది. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు 1,59,753.70 ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది. భారతి సిమెంట్స్ కంపెనీలో ఇండియా సిమెంట్స్ యాజమాన్యం 95.32 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్లు పేర్కొంది. పెన్నా సిమెంట్స్‌కు 1,50,325.02 మేర ఆర్డర్లు అందినట్లు ఆ కథనం వివరించింది.

మంత్రి మేకపాటి ఏం చెబుతున్నారు?
భారతీ సిమెంట్స్'కు దోచిపెట్టడానికే సిమెంట్ ధరలను పెంచేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే తమ విమర్శలను జగన్ సర్కార్‌పై ఎక్కుపెట్టారు. ధరలను పెంచడం వల్లే తమకు రికార్డు స్థాయిలో లాభాలొచ్చినట్లు భారతి సిమెంట్స్.. తన వార్షిక నివేదికలో స్పష్టం చేసిందని విమర్శిస్తున్నారు. దీనికి తోడు అత్యధికంగా బల్క్ ఆర్డర్లు సొంత కంపెనీకే ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనంటూ మండిపడుతున్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. తెలుగుదేశం నేతల ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరణ ఇచ్చారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా..
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, సమయానికి అనుగుణంగా భారతి యాజమాన్యం.. సిమెంట్‌ను సరఫరా చేస్తోందని మేకపాటి స్పష్టం చేశారు. టీడీపీ చేసిన ఆరోపణలు నిజమే అనుకుంటే.. తాము ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్‌కు ఆర్డర్లు ఎందుకు ఇచ్చామని ప్రశ్నించారు. వైఎస్సార్ నిర్మాణ్ కార్యక్రమాల కోసం సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ధరను నిర్ధారించిందని, దీని ప్రకారం.. ప్రభుత్వం కొనుగోలు చేసే 50 కేజీల సిమెంట్ బస్తా ఒక్కింటికి 225 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని ఆంగ్ల దినపత్రిక వెబ్‌సైట్ కథనం పేర్కొంది.

ధర గిట్టుబాటు కాకపోవడం వల్లే..
50 కేజీల సిమెంట్ బస్తాకు తాము నిర్ధారించిన 225 రూపాయల ధర గిట్టుబాటు కాకపోవడం వల్లే చాలావరకు సిమెంట్ కంపెనీలు ముందుకు రావట్లేదని, బల్క్ ఆర్డర్లను స్వీకరించడానికి సుముఖంగా లేవని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ఉటంకించింది. సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్డర్లను తాము ఏ ఒకటి లేదా రెండు కంపెనీలకు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్‌కు తెలియజేసేలా ఆదేశాలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలోనూ 50 కేజీల సిమెంట్ బస్తా ఒక్కింటికి 230 రూపాయలకు సరఫరా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని భారతి సిమెంట్స్ మరో డైరెక్టర్ ఎం రవీందర్ రెడ్డి వివరించినట్లు స్పష్టం చేసింది.