చిరు వ్యాపారుల కోసం 'జగనన్న తోడు' ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ .. వారి ఖాతాల్లో 10 వేలు జమ
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మర బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. వీధి వ్యాపారులను ఆదుకోవడం కోసం నేడు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లు గా పేర్కొన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయం నుండి జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం ఆన్లైన్లో బటన్ నొక్కి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను వారి ఖాతాలలో జమ చేశారు
రెండు రాష్ట్రాల్లోనూ పాలన ఒకటే: సీఎం కేసీఆర్, సీఎం జగన్ లపై బాబుమోహన్ ఫైర్

జగనన్న తోడు పథకం ప్రారంభం .. చిరువ్యాపారులకు 10 వేల నగదు జమ
ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్ధిక భరోసా అందించి, వడ్డీ లేని రుణాల ద్వారా వారి వ్యాపార తోడ్పాటును అందించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానితో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు . ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిరు వ్యాపారాలతో విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

పాదయాత్ర నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సీఎం జగన్
పాదయాత్ర సమయంలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిని చూసి, వారి కష్టాలకు చలించిపోయాను అని చెప్పిన సీఎం జగన్ వారి ఆత్మగౌరవంతో బ్రతకడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి లోను దొరకకపోవడంతో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారాలు చేస్తారని, ఇక అలాంటి విధానానికి స్వస్తి చెప్పి, వీధి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించడానికి ఈ పథకాన్ని అందిస్తున్నట్టుగా తెలిపారు.

రుణాలపై వడ్డీ బాధ్యత ప్రభుత్వానిదే
బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వీరు ఈ రుణాలపై వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు
. గతంలో వీధి వ్యాపారులను ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వార్డులలో, గ్రామ సచివాలయాలలో వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు వీరికి తోడుగా నిలబడుతున్నారు అని తెలిపారు. లబ్ధిదారులను గుర్తించడం, దరఖాస్తులు తీసుకోవడం దగ్గర్నుండి బ్యాంకర్లతో మాట్లాడడం, వారికి రుణాలు ఇప్పించడం చేస్తారని పేర్కొన్నారు .

చిరు వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలు .. వారిలో హర్షం
బ్యాంకులు దాదాపుగా 10 లక్షల మందికి వెయ్యి కోట్లు ఇస్తాయని పేర్కొన్నారు.
అయితే లబ్ధిదారులు రుణాన్ని తప్పకుండా చెల్లించాలని, సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి మళ్లీమళ్లీ రుణాలను బ్యాంకర్లు అందిస్తారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, వీధి వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలను అందించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వీధి వ్యాపారాలు చేసుకునే వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాల నిర్వహణకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకం ద్వారా వీధులలో చిరు వ్యాపారులకు ఐడి కార్డులు ఇవ్వడంతోపాటుగా పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు.