ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు - ఏం జరుగుతోంది..!!
ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదన వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ నుంచి అన్ని రకాల కనెక్షన్లకు ఈ తరహా మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా నియామకాలు చేసి.. వారికి శిక్షణ ఇస్తున్నారు. టార్గెట్లు ఫిక్స్ చేసి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.
విద్యుత్ కనెక్షన్లకు
ఏపీలో విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటు పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు డిస్కంలకు ఆదానీ స్మార్ట్ మీటర్లు చేరుకున్నాయి. ఈ మీటర్లను బిగించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కోసం ప్రత్యేకంగా కన్సెల్టెన్సీని ఏర్పాటు చేసారు. ఈ సంస్థ నియామక ప్రక్రియ చేపట్టింది. కాంట్రాక్టు విధనాంలో సిబ్బందిని తీసుకొని వారికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు.

ప్రత్యేక సిబ్బందితో
ఎల్‌టి, హెచ్‌టిలతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లను బిగించేందుకు అనుభవం ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, ఒంగోలు జిల్లాలకు అవసరమైన సిబ్బందికి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఇపిడిసిఎల్ పరిధిలోని రాజమండ్రిలో ఈ నెల 22వ తేదిన నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మీటర్ల బిగింపు పనులను వీరు చేపట్టనున్నారు. అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకునే వర్కర్లకు రూ.24 వేలు, సూపర్‌వైజర్లకు రూ.45 వేల ప్రారంభ వేతనం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
డిసెంబర్ నుంచి
వీరికి డిసెంబర్ ఒకటోతేదీ నుండి విధుల్లోకి హాజరవ్వాలని కన్సల్టెన్సీ ప్రతినిధులు సూచిస్తున్నారు. తొలివిడతలో సర్వే నిర్వహణ..ఆ తరువాత, మీటర్ల మార్పు దిశగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసారు. అయితే, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తో విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతుందని వామపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యత్ అధికారులు మాత్రం ఛార్జీల్లో మార్పు ఉండదని చెబుతున్నారు. దీంతో..స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications