సుప్రీం ఒప్పుకున్నా సహాయనిరాకరణే ?పంచాయతీపై ఉద్యోగుల వ్యూహమిదే- అదెలా లీకైంది ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్ఱభుత్వానికి, ఎన్నికల సంఘానికీ మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో ఉద్యోగులు కీలకంగా మారిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు మరో సంచలన వ్యూహానికి తెరలేపాయా అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేత తాజా కామెంట్సే ఇందుకు కారణం. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపైనా ప్రభుత్వం, ఉద్యోగులు ముందే ఓ అంచనాకు వచ్చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.
పంచాయతీ నోటిఫికేషన్‌పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీ

సుప్రీం తీర్పుపై సర్కారు, ఉద్యోగుల అంచనా
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఇందులో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్దితులు లేవని మరోసారి వాదిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యూహాన్ని ముందే పసిగట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ వారి కంటే ముందే కేవియట్ పిటిషన్ దాఖలు దేశారు. ఇవాళ ఈ రెండింటితో పాటు ఉద్యోగ సంఘాల పిటిషన్లను కూడా విచారించి సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఈ తీర్పుపై ఉద్యోగ సంఘాలతో పాటు ప్రభుత్వం కూడా ముందుగానే ఓ అంచనాకు వచ్చేశాయా అన్న వాదన వినిపిస్తోంది.

సుప్రీంలో ఎదురుదెబ్బ తప్పదా ?
ఏపీ పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను ఇవాళ మధ్యాహ్నానికి విచారించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఈ తీర్పు తమకు అనుకూలంగా రాకపోవచ్చని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజస్ధాన్, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఉద్యోగ సంఘాలు ఈ అంచనాకు వచ్చేసినట్లు అర్ధమవుతోంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు రాగానే చేపట్టాల్సిన కార్యాచరణపై ఉద్యోగులు చర్చల్లో మునిగితేలుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏం చేయాలనే దానిపై నిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సాగిస్తున్న పోరును ముందుండి నడిపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తాజాగా సుప్రీంతీర్పు, ఎన్నికల సన్నద్ధతతపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం రాజ్యాంగం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎదుటివాడిని చంపే హక్కు కూడా ఇచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డి.. తాజాగా సుప్రీం ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా.. నామినేషన్ల ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందా..? ఎన్నికలు జరిగే వాతావరణం ఉందా..? అని ప్రశ్నించారు. నామినేషన్ల పత్రాలు సిద్దంగా లేవు.. ఓటర్ల జాబితాలను ప్రింట్ చేయలేదు.. నామినేషన్లు దాఖలు చేసే వారికి ఓటర్ల జాబితా ఇవ్వాలి.. ఇప్పుడు సాధ్యం కాదు.. పాత పోలింగ్ బూతులలో నాడు-నేడు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
అసలు సుప్రీం ఎన్నికలు జరపాలని చెప్పినా ఉద్యోగులు సహకరిస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తే
పంచాయతీ ఎన్నికలపై ఉద్యోగులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సుప్రీంకోర్టు ఎన్నికలు జరపాలని చెప్పినా దాన్ని ధిక్కరించి సహాయ నిరాకరణ చేస్తామంటూ సంకేతాలు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు, అనంతర పరిణామాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు కోర్టు ధిక్కారం కింద కేసుల నమాదుకు ఆదేశిస్తాయా లేక ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయనేది కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా సర్కారు మద్దతు ఉందన్న కారణంతో ఉద్యోగులు దేనికైనా సిద్ధం కావడం చూస్తుంటే భవిష్యత్తులో వారికీ ఇబ్బందులు తప్పేలా లేవు.