వైయస్‌కు రోశయ్య..జగన్‌కు బుగ్గన: ప్రతిపక్షంపై సామెతలు..సెటైర్లు..కధలు: అసెంబ్లీలో ట్రబు
శాసనసభలో రోశయ్య ఉంటే ఎదురు పక్షం అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా వారికి టెన్షనే. ఆయన ప్రజాకర్షణ ఉన్న నేత కాదు. కానీ సమర్ధవంతమైన ఆర్దిక మంత్రి. సుదీర్ఘ పాలనా అనుభవం ఆయన సొంతం. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రిగా ఉన్న బుగ్గన సైతం రోశయ్య తరహాలోనే వ్యవహార శైలి కనిపి స్తోంది. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా..టీడీపీ నేతలకు సభలో తన వ్యంగోక్తులు..చరుకలు..సెటైర్లతో మాట్లాడటానికి వీలు లేకుండా చేసేవారు. ఇప్పుడు బుగ్గన సైతం జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీలో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

సభలో సెటైర్లు..కధలు..చురకలు
వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్దిక మంత్రిగా బుగ్గన వ్యవహరిస్తారని అందరూ ముందు నుండే ఊహించారు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ బుగ్గన రాజేంద్ర నాధ్ నాటి అధికార పక్షం మీద చాలా కూల్‌గా పదునైన విమర్శలతో చురకలు అంటించేవారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భూమా నాగిరెడ్డికి తొలుత జగన్ పీఏసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆయన వైసీపీ వదిలి టీడీపీలో చేరటంతో..ఆ వెంటనే బుగ్గనకు పీఏసీ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తూ జగన్ నిర్నయించారు. తొలి నుండి ఇంగ్లీషు మీడియం చదువులైనా అంశాల వారీగా లోతుగా అధ్యయనం చేయటం.. ఏ అంశాలతో ఎదుటి పక్షాన్ని ఇరుకున పెట్టాలో అతి తక్కువ సమయంలోనే బాగా తెలుసుకున్నారు. రాయలసీమ యసలో..సీమ ప్రాంతపు సామెతలతో..కధలతో.. వ్యంగాస్త్రాలతో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా..శాసనసభా వ్యవహా రాల శాఖా మంత్రిగా ప్రతిపక్ష టీడీపీని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. మొత్తం జగన్ కేబినెట్లో ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న అతి తక్కువ మందిలో బుగ్గన తొలి స్థానంలో ఉంటారు.

జగన్‌కు కుడి భుజంగా..ట్రబుల్ షూటర్‌గా..
నాడు వైయస్సార్ సైతం హామీల వర్షం కురిపించేవారు. ఆర్దిక మం్రతిగా డబ్బులు సర్దుబాటు చేయలేక రోశయ్య ఇబ్బంది పడేవారు. అయినా...వైయస్ మీద నమ్మకంతో రోశయ్య పరిస్థితి వివరించటం వరకు మాత్రమే పరిమితం అయ్యేవారు. ఇక, సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు..నాటి టీడీపీ ప్రముఖులు నాగం జనార్ధనరెడ్డి..ఎర్రబెల్లి దయాకర్ ..
ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారిని తన వ్యంగాస్త్రాలు..సామెతలతో మరో మాట మాట్లాడకుండా అడ్డుకొనే వారు. ఇక, ఇప్పుడు జగన్ సైతం హామీల వరదకు అడ్డు లేకుండా పోయింది. ఆర్దిక మంత్రిగా వాటికి బడ్జెట్ నిర్వహణ బుగ్గన సమర్ధతకు పరీక్షగా మారింది. అదే సమయంలో వైసీపీ నుండి 151 మంది గెలిచినా..25 మంది మంత్రులు ఉన్నా.. చాలా మంది కొత్తవారే కావటంతో ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకోవచ్చని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భావించింది. కానీ,
తొలి సారి మంత్రి అయినా..బుగ్గన మాత్రం అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రిగా ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్న సమయంలో ట్రబుల్ షూటర్‌గా మారుతున్నారు. ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.

కూల్‌గా.. విమర్శలకు ఆవకాశం లేకుండా..
బుగ్గన సభలో లెవనెత్తే అంశాల పైన ముందుగానే పూర్తి సమాచారం..అవగాహనతో సభకు వస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాల పైన పూర్తి అధ్యయనం చేస్తున్నారు. చర్చకు వచ్చే ప్రతీ అంశంలో గత ప్రభుత్వ లోపాలను ముందు గానే అధ్యయనం చేయటంతో వారి విమర్శలను తిప్పి కొట్టటానికి సులువుగా మారింది. ఇంతగా ఇతర మంత్రులు కసరత్తు చేయటం లేదు. సభలో ముఖ్యమంత్రి సైతం ఒక్కో సందర్భంలో ఆవేశానికి లోనైన సమయంలో సభను కూల్ చేయటంలో..పరిస్థితిని కంట్రోల్ లోకి తేవటంతో బుగ్గన ఇప్పుడు క్రియా శీలకంగా మారారు. ఇక, సందర్భానుసారం కధలు చెప్పటం ద్వారా సభనూ పూర్తిగా తన వైపు తిప్పుకోగలుగుతున్నారు. సున్నితంగా ప్రతిపక్షం పైన విమర్శలు మాత్రమే చేస్తారు. తాజాగా..బుగ్గన సభలో స్విస్ ఛాలెంజ్.. టెండర్ల ఖరారు విషయంలో టీడీపీ ప్రభుత్వ తీరు పైన కధల రూపంలో చెప్పిన విషయాలు స్పీకర్..సీఎంనే కాదు..సమావేశాలు టీవీల ద్వారా చూస్తున్న వారిని సైతం నవ్వుల్లో ముంచేసింది.