ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జూదం నియంత్రణ బిల్లు- ఎవరినీ వదిలిపెట్టబోమన్న జగన్
ఏపీ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ఆన్లైన్ జూదం నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఆన్లైన్ గేమింగ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు చేయడంతో సీఎం జగన్ స్పందించారు.
ఆన్లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారని జగన్ గుర్తుచేశారు. మంత్రి బంధువు అని చెప్పి ఊరుకోకుండా, కేసు పెట్టామన్నారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించబోమని సీఎం జగన్ హెచ్చరించారు.
తమ ప్రభుత్వం ఆ విధంగా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నానని కూడా అన్నారు.
తప్పు ఎవరు చేసినా తప్పే. ఎక్కడైనా సరే తెలిస్తే, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని జగన్ సూచించారు.

రాష్ట్రంలో ఆన్లైన్ జూదం నియంత్రణకు పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని, ఎక్కడా, ఎవరినీ వదిలిపెట్టడం ఉండదనని సీఎం జగన్ తెలిపారు. కచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. ఆన్లైన్ జూదానికి పిల్లలు అలవాటు కావొద్దని, వారి భవిష్యత్తు చెడిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు జగన్ తెలిపారు. ఐదేళ్లలో ఆన్లైన్ జూదాన్ని నియంత్రించడానికి కనీసం చట్టం కూడా ఎందుకు తీసుకు రాలేదని జగన్ ప్రశ్నించారు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదన్నారు. ఇవాళ తాము చట్టం తీసుకొస్తుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి రాజకీయంగా ట్విస్ట్ చేయాలన్న విపక్ష టీడీపీ తీరు బాగోలేదన్నారు.