ఏపీ సర్కార్ భూముల వేలం .. వంద కోట్లకు పైగానే .. విశాఖ, గుంటూరులలో బిడ్ లకు ఆహ్వానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు వేలానికి సర్కారు సిద్ధమైంది గుంటూరు విశాఖపట్నం నగరాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. పరిశ్రమలు, ఆసుపత్రి వంటి అవసరాలకు ప్రతిపాదించిన స్థలాలు కూడా అమ్మకానికి పెట్టింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ లో భాగంగా విశాఖ లో మూడు చోట్ల 3.32 ఎకరాలు, గుంటూరులో రెండు చోట్ల 11.51 ఎకరాల భూములు విక్రయించడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నాని

విశాఖ, గుంటూరులలో ప్రభుత్వ భూముల విక్రయాలకు బిడ్ లకు ఆహ్వానం
విశాఖ, గుంటూరులలో విక్రయించడానికి సిద్ధం చేసిన భూముల రిజర్వు ధర 106.90 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్లో ఈ భూములు అంతకంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి అని పేర్కొంది. ఈ వేలం పాటలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసే వారికే ఈ భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్ బి సి సి ఇండియా లిమిటెడ్ పేర్కొంది. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగే వేలంపాటలో పాల్గొనదలచిన వారు ఈ నెల 23వ తేదీ వరకు ప్రీ బిడ్ ఈఎండి చెల్లించాలని కూడా ప్రకటనలో స్పష్టంగా తెలిపింది.

గుంటూరులో 11.51 ఎకరాలు , విశాఖలో 3.32 ఎకరాల విక్రయం
గుంటూరులో విక్రయించనున్న స్థలాల వివరాలు చూస్తే నల్లపాడులో రెండు సర్వే నంబర్లలో ఉన్న 6.07 ఎకరాలు, దీని రిజర్వు ధర 16.96 కోట్లుగా ఉంది . మరో సర్వేనెంబర్ లో ఉన్న 5.44 ఎకరాల భూమి రిజర్వు ధర 75.41 కోట్లు గా ఉంది .
విశాఖలో పారిశ్రామిక అవసరాల కోసం ఫకీరుతక్యాలో ఏపీఐఐసీ కేటాయించిన భూములను 3.32 ఎకరాల స్థలాన్ని విక్రయించనుంది . ఫకీరు తక్యాలో ఏపీఐఐసీకి చెందిన భూమిలో 1.93 ఎకరాలను పచ్చదనం కోసం కేటాయించగా ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెడుతున్నారు.

వివిధ శాఖలకు కేటాయించిన భూముల విక్రయాలు
విశాఖపట్నం చినగదిలిలో హోం శాఖకు చెందిన ఎకరం భూమిని, ఇదే ప్రాంతంలో రెవిన్యూ కు చెందిన 75 సెంట్ లను , అనగంపూడి రెవెన్యూ కు చెందిన 50 సెంట్లను , సీతమ్మధారలో రెవిన్యూ శాఖ వారి ఎకరం భూమిని విక్రయించనున్నట్లు గా తెలుస్తుంది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను విక్రయిస్తున్న ప్రభుత్వం, బిల్డ్ ఏపీ మిషన్ లో భాగంగా విశాఖలో, గుంటూరులో పలు శాఖలకు చెందిన భూములను వేలం వేయనుంది .

సంక్షేమ పథకాల అమలుకు ఏపీసర్కార్ ఈవేలం నిర్ణయం
విశాఖలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి, గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఉద్దేశించిన భూములను సర్కార్ వేలం వేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు పాజిటివ్ గా చూస్తుండగా , ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి . నాడు-నేడు,
నవరత్నాలు, లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పనకు నిధుల కోసం 2019, నవంబరులో ఏపీ ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని ఈ-వేలం ద్వారా విక్రయించి వచ్చే నిధులను సంక్షేమ పథకాల అమలుకు వ్యయం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .