సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. నవంబర్ 20 నుండే అమలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఇప్పటివరకు రేషన్ కార్డును మాత్రమే ప్రాతిపదికగా తీసుకునేవారు. కానీ ఇకనుండి రేషన్ కార్డు కేవలం రేషన్ పొందడానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రభుత్వ పథకాలను పొందడానికి రేషన్ కార్డు ఏమాత్రం పనికిరాదు.
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఇక లేనట్లే: ఏపీ ప్రభుత్వ నిర్ణయం: సింగపూర్ ప్రభుత్వం సైతం అంగీకారం..!

ప్రభుత్వ పథకాలను పొందడం కోసం ఏపీ ప్రభుత్వం మరో నాలుగు కొత్త కార్డులు
ప్రభుత్వ పథకాలను పొందడం కోసం ఏపీ ప్రభుత్వం మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టనుంది. బడుగు బలహీనవర్గాల కేటగిరీలో ప్రభుత్వ పథకాలను పొందాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు. కానీ అది నిన్నటి మాట. ఇప్పుడు ఏపీ సర్కార్ ఆ మాటను తిరగరాయనుంది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆయా పథకాలకు సంబంధించిన ప్రజల అర్హతను బట్టి కార్డులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

పాత రేషన్ కార్డు కాక మిగతా పథకాల కోసం కొత్త కార్డుల కేటాయింపు
అయితే పాత రేషన్ కార్డు మాత్రం రద్దు చేయకుండా ప్రభుత్వ పథకాల కోసం మాత్రం ప్రత్యేకంగా కొత్త కార్డులను కేటాయిస్తారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా అంశాలకు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పించన్ కార్డు,ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇలా ఏ విభాగానికి అదే కార్డులను ఇవ్వనున్నారు. ఈ అన్ని విభాగాల్లోనూ వారికి ఉండాల్సిన అర్హతలను పరిశీలించి కార్డులను ఇవ్వనున్నారు.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ అన్ని కార్డులు ఇవ్వాలన్న రూల్ లేదు. వారి వారి అర్హతలను బట్టి మాత్రమే కార్డులు ఇస్తారు.

నవంబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి కొత్త కార్డుల నిర్ణయం ..
పాత రేషన్ కార్డులు అలాగే ఉంచి నూతన కార్డులను అందుబాటులోకి తెచ్చే ఈ నిర్ణయం నవంబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గ్రామాల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులు విలేజ్ వాలంటీర్లు,అర్హులైన వారిని గుర్తించి వారికి కార్డులను జారీ చేస్తారు. ఇక ఈ కార్డులను అందించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా అర్హులకే చేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నాలుగు కార్డులు అవసరమా అని ఏపీ ప్రజలు కాస్త ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రేషన్ కార్డ్ తో అందే పథకాలకు ఇన్ని కార్డులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

పథకాలు పక్కదారి పట్టకుండా నిర్ణయం .. సత్ఫలితాలు ఇస్తుందా ?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుండి రేషన్ షాపులో నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు రేషన్ కార్డు, ఉచిత వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీ కార్డు,విద్యార్థుల చదువు విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, పింఛన్ పొందే వారి కోసం పింఛన్ కార్డులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పారదర్శక పాలన చెయ్యాలని భావించిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డుల కథను మార్చే ఈ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!