సీఎం కాన్వాయ్ కోసం వాహనం స్వాధీనం - ప్రభుత్వం సీరియస్ : ఇద్దరు అధికారులపై వేటు..!!
ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కోసం ఒక ప్రయివేటు వాహనం బలవంతంగా సీజ్ చేసిన ఘటన పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఆయన పర్యటన కోసం కాన్వాయ్ లో వాహన శ్రేణి కోసం ఆర్టీఏ అధికారులు అత్సుత్సాహం ప్రదర్శించారు. తిరుపతికి వెళ్తున్న ఒక సాధారణ భక్తుడు కుటుంబంతో ఉన్న సమయంలో బలవంతంగా వాహనం స్వాధీనం చేసుకున్నారు. దీని పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. ఈ ఘటన పైన విచారణకు ఆదేశించిన సీఎంఓ..కారకులైన ఇద్దరు ఉద్యోగుల పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్తూ మధ్యలో ఒంగోలులో టిఫిన్ చేయటం కోసం ఆగారు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి..వాళ్ల వాహనంతో పాటుగాగా డ్రైవర్ ను ఇవ్వాలని డిమాండ్ చేసారు. తాము తిరుపతి వెళ్తున్నామని..తమ వాహనం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా..ఉన్నతాధికారుల ఆదేశాలంటూ శ్రీనివాస్ వాహనంతో పాటుగా డ్రైవర్ ను తీసుకొని వెళ్లిపోయారు.
ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయింది. దీంతో..సీఎంఓ స్పందించింది. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన పైన వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

జిల్లా అధికారుల నుంచి తెప్పించుకున్న నివేదిక ఆధారంగా సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న సంధ్యా తో పాటుగా హోం గార్డు తిరుపాల్ రెడ్డి పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బాధితుడికి వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ ఘటన పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రయివేటు వాహనాలు బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దీంతో..ఇది రాజకీయంగానూ విమర్శలకు కారణమైంది. దీంతో..ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారి పైన చర్యలకు ఆదేశించింది.