
"సర్కారువారిపాట"కు అనుమతి ఎలా ఇచ్చారు?
సర్కారువారిపాటకు ఏపీ ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని థియేటర్లలో విడుదల చేసే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కావాలంటే ఆ సినిమాలు నటుల రెమ్యునరేషన్లు కాకుండానే రూ.100కోట్ల బడ్జెట్ ఉండాలని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పుడు ఆ లెక్కలన్నింటినీ నిర్మాత, దర్శకులు ప్రభుత్వానికి అందజేశారు. అలాగే ఆ తర్వాత ఆచార్యకు, ఇప్పుడు సర్కారువారి పాటకు ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీచేశారు.

ఏపీలో షూటింగ్ జరగలేదు
సర్కారువారిపాట చిత్రం ఏపీలో ఎక్కడా షూటింగ్ చేయలేదు. ఏపీలో షూటింగ్ చేసిన చిత్రానికే ధరలపై అనుమతివ్వాలి. అంతేకాదు మహేష్‌బాబు రెమ్యునరేషన్ కాకుండా సర్కారువారిపాటి బడ్జెట్ రూ.60కోట్లు. అంటే 100 కోట్లరూపాయల బడ్జెట్ అవలేదు. మరి ఏ లెక్కన అనుమతులు మంజూరు చేశారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.

ఆచార్య వడ్డీలే రూ.50 కోట్లంట!
ఆచార్యకు ఇలాగే జగన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. బడ్జెట్ ఎంత అనే లెక్కలు సమర్పించలేదు. దీనిపై విలేకరులు చిరంజీవిని ప్రశ్నించినప్పుడు ఆయన తమ చిత్రానికి వడ్డీలే రూ.50 కోట్లు అయ్యాయని చెప్పారు. అంటే సినిమా నిర్మాణం కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బుపై వడ్డీ కూడా బడ్జెట్ కిందకు వస్తుందని మనం అనుకోవాలి.

అయినవారికి ఒకలా.. కానివారికి మరోలా
ఏపీ ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరల పెంపుదలను తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఇష్టమైనవారికి ఒకలా, ఇష్టంలేనివారికి ఒకలా అనుమతులిస్తున్నారంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినవారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తాను రూపొందించిన నియమ నిబంధనలను తానే ఉల్లంఘిస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అయినవారికి ఒకలా, కానివారికి మరోలా ప్రభుత్వం వడ్డిస్తోందంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో??.