గవర్నర్ కోర్టులో రాజధాని బిల్లులు- ఆమోదం ఖాయమేనా ?- కేంద్రం నిర్ణయమే కీలకం...
ఏపీలో మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ కోర్టుకు చేరాయి. ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లులను మండలి ఆమోదంతో పని లేకుండానే గవర్నర్ కు అధికారులు పంపించారు. ఈ నెల 17తో ఈ రెండు బిల్లులు చట్ట సభల ఆమోదానికి గడువు ముగియడంతో వీటిని నేరుగా గవర్నర్ కు పంపారు. వాటిని గవర్నర్ ఆమోదించడం కూడా లాంఛనంగానే కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదించడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే జగన్ సర్కార్ రాజధాని తరలింపుకు ఆమోదం లభించినట్లే.

గవర్నర్ కోర్టులో రాజధాని బిల్లులు...
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు కోసం ఉద్దేశించిన రెండు బిల్లులను అసెంబ్లీ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించింది. మండలి ఓసారి సెలక్ట్ కమిటీకి పంపినా ఫలితం తేలలేదు. రెండోసారి వీటిని మండలిలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం చిక్కలేదు. దీంతో నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం వీటిని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఇవాళ ఈ బిల్లులు గవర్నర్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్ భవన్ చేరాయి. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించేందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగి పోయినట్లే.

ఆమోదం లాంఛనమేనా ?
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించి పంపిన మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లాంఛనమే అని తెలుస్తోంది. గవర్నర్ ఇప్పటికే దీనిపై సానుకూలంగా ఉన్నట్లు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అర్ధమైంది. ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు గవర్నర్ హరిచందన్ తన ప్రసంగంలోనే వెల్లడించారు. ఆయనకు అభ్యంతరాలు ఏవైనా ఉంటే అప్పుడే చెప్పి ఉండే వారని, అలా జరగలేదు కాబట్టి ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టీడీపీ అభ్యంతరాలు..
రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై ముందు నుంచీ వ్యతిరేకంగా ఉన్న విపక్ష టీడీపీ ఇప్పటికే తమకు బలమున్న మండలిలో బిల్లులను విజయవంతంగా అడ్డుకుంది. ఓసారి సెలక్ట్ కమిటీ పేరుతో మరోసారి అసలు బిల్లులు ప్రవేశపెట్టకుండానే అడ్డుకున్న టీడీపీ... ఇప్పుడు బిల్లులు గవర్నర్ కోర్టుకు చేరడంతో వీటిపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోమని గవర్నర్ ను కోరుతోంది. రాజధాని నిర్ణయం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని, అందుకే అటార్నీ అభిప్రాయం అవసరమని టీడీపీ వాదిస్తోంది. అయితే గవర్నర్ వీటిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

కేంద్ర నిర్ణయం కీలకమవుతుందా ?
గవర్నర్ చెంతకు చేరిన మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం లాంఛనమే అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ఆయన కేంద్రం అభిప్రాయం కోరవచ్చనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ అభిప్రాయం కూడా తీసుకుని ఈ బిల్లులను ఆమోదిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సోమవారం లోపు కేంద్ర హోంశాఖ వర్గాలను సంప్రదించి రాజధాని బిల్లుల భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.

ఆమోదం కాగానే రంగంలోకి సర్కార్...
రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదించగానే వాటిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఓసారి గవర్నర్ ఆమోదం లభించగానే తరలింపు ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. శాసన ప్రక్రియ ద్వారానే రాజధాని తరలింపు ఉంటుందని ఇప్పటికే హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభిస్తే అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. ఓసారి గవర్నర్ ఆమోదం లభిస్తే ముందుగా సీఎం జగన్ విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఆ తర్వాత ఉద్యోగులు, విద్యాసంవత్సరం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది తరలింపు ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు.