లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ సర్కారు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా
అమరావతి: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ. 50 లక్షల సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
జగన్ సర్కార్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించగా, ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ సాయితేజ కుటుంబానికి అందించారు. వారిని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం బెంగళూరులోని ఎలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది. ఇవాల అక్కడే ఉండనుంది. ఆదివారం ఉదయం అక్కడ నుంచి అతడి స్వగ్రామానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.
Karnataka | Mortal remains of Lance Naik B Sai Teja, who lost his life in the #TamilNaduChopperCrash on Dec 8, reach the Yelahanka Air Force Base in Bengaluru; IAF military officials pay tribute pic.twitter.com/7XriHFyUtm
— ANI (@ANI) December 11, 2021
కాగా, డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూశారు. సీడీఎస్ దంపతులతోపాటు సాయితేజ సహా 11 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సాయి తేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు.
లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం.. అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ... ఆకస్మికంగా తనువు చాలించడం.. అందరినీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉంటూ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఊహించని ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర విషాదంలోకి నెట్టందని కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబంతోపాటు ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.