ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ నో..? గోప్యంగా ఎస్వోపీ భేటీ, కారణమిదేనా..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఏపీ సర్కార్-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధ్య విభేదాలతో నిర్వహించే పరిస్థితి లేదు. ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ఆరు వారాలు తర్వాత.. లాక్ డౌన్ వల్ల నిరవధికంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ క్రమంలో ఎస్ఈసీ తొలగింపు-నియామకం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.

కోర్టు ఆదేశాలతో.. అఖిలపక్ష సమావేశం..
పంచాయతీ ఎన్నికలపై ఇదివరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించింది. ఎన్నికల నిర్వహణపై ఇబ్బందులు ఏమిటని ఎస్ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల నిర్వహణ గురించి రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దానికంటే ముందే సర్కార్ పావులు కదిపింది. సోమవారం రాత్రి హుటాహుటిన కరోనా వైరస్ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' భేటీ ఏర్పాటు చేసింది. సమావేశంలో ప్రధాన సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఇందులో కరోనా గురించి కాక స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్చించినట్టు తెలిసింది.

రహస్యంగా ఎస్వోపీ భేటీ..
ఈ సమావేశాన్ని కూడా రహస్యంగా నిర్వహించారు. భేటీ తర్వాత అధికారులు కూడా మీడియాతో మాట్లాడలేదు. అయితే ఇదీ ఎన్నికలకు వెళ్లకుండా చట్టబద్దంగా అవకాశం సృష్టించడమే ఉద్దేశం అని తెలుస్తోంది. అందుకోసమే రెండురోజుల ముందు సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని వైఎస్ఆర్ సీపీ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఇదీ ఆ పార్టీ రాజకీయంగా నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ప్రభుత్వపరంగా కౌంటర్ వేసేందుకు మాత్రం కరోనా వైరస్ వల్ల ఎన్నికల నిర్వహించడం కష్టమని చెప్పేందుకు ఎస్వోపీ భేటీ ఏర్పాటు చేసి ఉంటారని అర్థమవుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని తెలుస్తోంది.

నిమ్మగడ్డ ఉండగా నో
ఎన్నికలకు సంబంధించి పాత ఆర్డినెన్స్ కాలం చెల్లగా.. ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఏ చట్టం ప్రకారం ఎన్నికలు జరపాలనే సందిగ్దత కూడా ఉంది. దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు కోర్టుకు వెళితే.. విషయం తేలడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసం జాప్యం కూడా కలిసి వస్తోంది. అంటే కనీసం 5 నెలలు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసి.. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరని తెలుస్తోంది. అయితే ఇదివరకు కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుండటం విశేషం. ఈ క్రమంలో ప్రభుత్వానికి-ఎస్ఈసీకి మళ్లీ కొల్డ్ వార్ తప్పదని తెలుస్తోంది. ఈ అనిశ్చితికి న్యాయస్థానాలే పరిష్కారం చెప్పాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.