ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఉద్యోగుల బదిలీల గడువు పెంపు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీవో లో నిర్దేశించిన సమయాన్ని పొడిగించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పది రోజుల క్రితం జీవో నెంబర్ 116 జారీ చేసింది. అందులో ఈ రోజుతో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తూ..స్పష్టమైన మార్గ నిర్దేశకాలను జారీ చేసింది. దీని మేరకు అనేక శాఖల్లో కసరత్తు జరిగింది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఇదే సమయంలో మరి కొంత సమయం కోరుతూ ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. వీటిని పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయం లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని.. ఇప్పటికే వెల్లడించిన నిబంధనల మేరకు దీనిని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల డీఐజీలతో పాటుగా పలు జిల్లాల రిజిస్ట్రార్ లను బదిలీ చేసారు. ఈ వ్యవహారం పైన విమర్శలు కూడా ఉన్నాయి.

ఇదే సమయంలో అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్లో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వేలాది ప్రాథమిక స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.17జీవో వల్ల పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పైన తీసుకున్న నిర్ణయంతో ఈ నెలఖారు లోగా సాధారణ బదిలీలు పూర్తి చేయాల్సి ఉంటుంది.