పవన్ కల్యాణ్.. యూటర్న్: జగన్ సర్కార్‌కు ఫుల్ సపోర్ట్‌గా: రాజధానిని తరలించినప్పుడు చూద్దాం
అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తూ వచ్చిన ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. అమరావతిని తరలిస్తామంటూ ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని తేల్చేశారు. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా అమరావతి కొనసాగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు కూడా తనకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు.
పుష్కర సంరంభం: ఎల్లుండి కర్నూలుకు వైఎస్ జగన్: నదీ స్నానంపై నిషేధం

అమరావతి రైతు ప్రతినిధులతో పవన్ భేటీ..
బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని తరలించడాన్ని నిరసిస్తూ తాము కొనసాగిస్తోన్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా పరిరక్షణ సమితి ప్రతినిధులు పవన్ కల్యాణ్‌కు విజ్ఙప్తి చేశారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలను తాము గత ప్రభుత్వానికి అప్పగించామని, ఇప్పుడు దాన్ని తరలిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిందని, దీనివల్ల తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో ఉద్యమాలు చేపట్టడం కష్టసాధ్యం..
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కూడా తనకు ఇదే విషయాన్ని తెలిపారని అన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందంటూ బీజేపీ డిక్లరేషన్ కూడా ఇచ్చిందని చెప్పారు. కరోనా వైరస్ వల్ల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉందని, ఉద్యమాలను నిర్వహించే పరిస్థితి లేదని పరోక్షంగా చెప్పారు. ఇలాంటి పరిణామాల మధ్య కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కష్టసాధ్యమని అన్నారు.

డెడ్లైన్లు పెట్టొద్దు..
తమ పార్టీ ప్రతినిధులను అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుల వద్దకు పంపిస్తామని, వారి సూచనలు సలహాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? జనసేన పార్టీ నుంచి ఎలాంటి మద్దతును కోరుకుంటున్నారు? ఈ ఉద్యమంలో తమ ప్రాతినిథ్యం ఎలా ఉండాలి? వంటి సూచలను ఇవ్వాలని అన్నారు. ఇదొక సుదీర్ఘ ఉద్యమ ప్రక్రియ అని పేర్కొన్నారు. అంతే గానీ- 365 రోజుల్లోగా మూడు రాజధానుల ఏర్పాటు ఆగిపోవాలని, లేదా అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా ప్రభుతం చేయించేలా ఉద్యమించడం కష్టమని అన్నారు. దీనిపై డెడ్లైన్లు పెట్టొద్దని సూచించారు. డెడ్లైన్లు పెట్టడం ఇబ్బందికర అంశమని కుండబద్దలు కొట్టారు.

అమరావతి కాదని ప్రభుత్వం చెప్పలేదు..
రాష్ట్ర రాజధాని అమరావతి కాదు.. అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా స్పష్టం చెప్పలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆన్ పేపర్ ఎక్కడా లేదని చెప్పారు. మూడు రాజధానులను వైసీపీ నేతలు ప్రకటనలు చేశారే తప్ప.. దాన్ని కార్యాచరణ రూపంలోకి పెట్టలేకపోయారని అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామని ఆన్ రికార్డ్‌గా వైసీపీ నేతలు ఇప్పటికీ ఎక్కడా చెప్పట్లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ అమరావతి రైతు ప్రతినిధులకు సూచించారు. అమరావతిని తరలిస్తామని ప్రభుత్వం గానీ, ఏ వైసీపీ నేత గానీ స్పష్టం చేయలేదని అన్నారు.

అప్పుడే కార్యాచరణ..
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామంటూ ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ప్రకటన వెలువడినప్పుడే తాము పోరాటం సాగిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాంటప్పుడే తాము కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామని అన్నారు. ఒక ఉద్యమాన్ని కొనసాగించాలంటే.. తాము చేపట్టిన ఉద్యమ అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తేనే ఉద్యమాన్ని కొనసాగించగలమని అన్నారు.

ఉండదని ఎవరూ చెప్పట్లేదు..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోందే తప్ప.. అమరావతి నుంచి తరలిస్తామని ప్రకటించలేదని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొనాలా? లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని అన్నారు. ప్రస్తుతం జనసేన ఒంటరి పార్టీ కాదని, బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని చెప్పారు. బీజేపీ నేతలతో చర్చించిన తరువాతే కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించాల్సి ఉందని అన్నారు. ప్రతినిధుల డిమాండ్లను తాను బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాము ఇదివరకు పార్టీ వైఖరిని హైకోర్టులోనూ స్పష్టం చేశామని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.