బీసీలకు 4.. ఎస్సీలకు 2: జెడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు: ఆరు మహిళలకే..!
హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్(అన్‌రిజర్వ్)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు అయ్యాయి.
13 జిల్లా పరిషన్ ఛైర్మన రిజర్వేషన్లు ఇలా..
ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో 13 జిల్లాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్ల ప్రకారం ఆరు జిల్లాలు మహిళలకు కేటాయించారు. నెల్లూరు జిల్లా..ఎస్టీ, అనంతపురం..ఎస్సీ, విజయనగరం..ఎస్సీ మహిళా, చిత్తూరు..బీసీ, క్రిష్టా జిల్లా..బీసీ, విశాఖ.. బీసీ మహిళ, పశ్చిమ గోదావరి ..బీసీ మహిళ, శ్రీకాకుళం..జనరల్, కడప..జనరల్, ప్రకాశం..జనరల్, తూర్పు గోదావరి.. జనరల్ మహిళ, గుంటూరు..జనరల్ మహిళ, కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ సైతం జనరల్ మహిళకు ఖరారు చేసారు. నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.

జిల్లాల వారీగా నోటిఫికేషన్లు...
ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడదులయ్యే అవకాశం కనిపిస్తోంది.