ఏపీలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?: అష్ట సూత్రాలు విడుదల చేసిన జగన్ సర్కార్
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఆరంభం కాబోతోంది. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమౌతుంది. దీనికోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు పూర్తి చేశాయి. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్ల సరఫరా పూర్తయింది. డిజిగ్నేటెడ్ పాయింట్లలో వ్యాక్సిన్లను భద్ర పరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోన్నారు.
డీజీపీ సవాంగ్‌పై జగన్ మార్క్ భోగిపళ్లు: నారా లోకేష్ కొత్త వివాదం..కొడాలి నాని పేరు: సుమోటోగా

అష్ట సూత్రాలను వెల్లడించిన ప్రభుత్వం..
వ్యాక్సినేషన్ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అష్ట సూత్రాలను ప్రకటించింది. వ్యాక్సినేషన్ సందర్భంగా టీకాలను వేయించుకోవడానికి తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలి? తదనంతరం ఎలాంటి నియమాలను పాటించాలనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.. అనంతరం ఏం చేయాలి? అనే వివరాలను తెలియజేసింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ సురక్షితమైనదని, ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.

కోవిన్ సిస్టమ్‌లో పేరు నమోదు..
కేంద్రం ప్రకటించిన ప్రాధాన్యత క్రమంలో అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కోవిన్ సిస్టమ్‌ను వినియోగించుకోవాలి. తమ పేరును నమోదు చేసే సమయంలో కోవిన్ సిస్టమ్‌లో సూచించిన వివరాలకు అనుగుణంగా తమ గుర్తింపు కార్డు, ఇతర సమాచారాన్ని అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో ఫోన్ నంబర్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత లబ్దిదారులు అందులో పొందుపరిచిన ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అందుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ధృవీకరించే ఎస్ఎంఎస్ అది.

టీకా ఎప్పుడు? ఎక్కడ? వేసేదీ ఎస్ఎంఎస్ ద్వారా..
కోవిన్ సిస్టమ్‌లో తమ పేరును నమోదు చేసుకున్న వారికి ఎప్పుడు? ఎక్కడ? ఏ సమయానికి వ్యాక్సిన్ ఇస్తారనే సమాచారం కూడా ఎస్ఎంఎస్ రూపంలోనే అందుతుంది. మొదటి డోసు టీకాను తీసుకున్న తరువాత.. రెండో డోసుకు సంబంధించిన వివరాలతో కూడిన మరో ఎస్ఎంఎస్ వేరుగా అందుతుంది. రెండో డోసు పూర్తయిన తరువా వారికి డిజిటల్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకున్న తరువాత.. ప్రతి ఒక్కరు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు లేదా హోమ్ గార్డులకు తమ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

కోవిన్ సిస్టమ్‌లో గుర్తింపు కార్డును సరి చూసిన తరువాతే..
కోవిన్ సిస్టమ్‌లో నమోదు చేసిన గుర్తింపు కార్డును సరి చూసిన తరువాతే టీకా వేస్తారు. రెండో డోసును వేసే అధికారి దీనికి సంబంధించిన వివరాలను నిర్ధారిస్తారు. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే బయటికి వెళ్లే వీలు లేదు. కనీసం అరగంట పాటు లబ్దిదారులు అక్కడే వేచి ఉండాల్సి ఉంటుంది. టీకా తరువాత తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తల గురించి డాక్టర్లు వారికి కొన్ని ముందుజాగ్రత్తలు, సూచనలను తెలియజేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా అందిన సమాచారం మేరకు రెండో డోసు కోసం అర్హులు సంబంధిత కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.