అమరావతి లో సర్కారు వారి పాట - ప్రభుత్వ ఆలోచన మారిందా : అక్కడే అసలు ట్విస్ట్..!!
అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉంది. మూడు రాజధానుల వ్యవహారం .. న్యాయ పరమైన చిక్కులతో బిల్లులను ఉప సంహరించుకున్న ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో నిర్మాణాలు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు గత మార్చిలో ఆదేశాలు ఇచ్చింది. ఆరు నెలలు కాదు..అరవై నెలల సమయం కావాలంటూ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇక, నిర్మాణంలో సగంలో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం నిధుల అన్వేషణ ప్రారంభించింది. ఏ బ్యాంకు నుంచి రుణం పైన హామీ రాలేదు. దీంతో.. అమరావతి భూములనే విక్రయించి..అక్కడ నిర్మాణాలను పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంది.

సీఆర్డీఏకు ప్రభుత్వం అనుమతి
ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా 15 ఎకరాలను విక్రయించేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. దశలవారీగా 500 ఎకరాలను విక్రయించాలని భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సీఆర్డీఏ తన బాధ్యత నిర్వర్తించేందుకు భూముల విక్రయం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అమ్మకం చేయనున్న భూముల కనీస ధరను నిర్ణయించేందుకు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసారు. అయితే, ఎకరం పది కోట్లకు అమ్మకం చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగింది. కానీ, ప్రభుత్వ వర్గాలు మాత్రం 10 కోట్లు ధర పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక మేరకు కనీస ధర ఖరారు కానుంది.

కోర్టు తీర్పు మేరకు నిర్మాణాల కోసమంటూ
సీఆర్డీఏ కమిషనర్ ఒక ఎస్క్రో ఖాతా తెరిచి, భూముల్ని విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని దానిలో జమచేయాలని, దాంతో రాజధానిలో పనులు చేపట్టాలని ఉత్వర్లుల్లో స్పష్టం చేసారు. ఇదే సమయంలో రాజధాని నిర్మాణాల కోసం రూ 3,500 కోట్ల రుణ సేకరణ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంకులు ప్రభుత్వ గ్యారంటీ కోరాయి.
దీని పైన ఆర్దిక - మున్సిపల్ శాఖలు సమీక్ష చేస్తున్నాయి. ఉత్తర్వుల్లో హైకోర్టు తీర్పును ప్రస్తావించటం.. తీర్పును అనుగుణంగా సీఆర్డీఏ బాధ్యత నిర్వర్తించేందుకు ఈ విక్రయాలని చెప్పటం ద్వారా అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేసే విధంగా ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందా అనే చర్చ మొదలైంది. అయితే, ప్రచారం సాగుతున్నట్లుగా ఎకరం రూ 10 కోట్లుగా నిర్ణయిస్తే మాత్రం కొనేందుకు ఎవరూ ముందుకు రారని ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.

అమరావతి పై ఆలోచన మారిందా
మూడేళ్లుగా అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. మూడు రాజధానుల వివాదంతో అమరావతి భూముల విలువ సైతం తగ్గింది. అయితే, ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే భూముల విక్రయాలు అని చెప్పటం పైన ఇంకా కొన్ని అంశాల పైన స్పష్టత రావాల్సి ఉందనే చర్చ మొదలైంది. రాజధానిలో భూములను తనఖా పెట్టినా..విక్రయించినా అది రాజధాని నిర్మాణానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
అదే సమయంలో ప్రభుత్వం భూములు అమ్మే సమయంలోనూ భవిష్యత్తు అవసరాల కోసం విడిగా ఉంచిన భూములనే అమ్మాల్సి ఉంటుంది. హైకోర్టు తీర్పు తరువాత అప్పీల్ కు వెళ్లపోవటం.. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాల కోసమే భూముల అమ్మకాలు అని చెప్పటం ..మొత్తంగా అమరావతి విషయంలో కోర్టు తీర్పు అమలుకే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక, ఈ మొత్తం ఎపిసోడ్ పైన ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.