సొంత గ్రామంలో కాదు..మూడు ప్రాంతాలు ఎంపిక ఛాన్స్: సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు..!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగలు నియామకాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసారు. అభ్యర్ధి సొంత గ్రామంలో మాత్రం అవకాశం ఇవ్వరు. మండలం వరకు ఇబ్బంది లేదని అధికారు లు స్పష్టం చేసారు. అదే సమయంలో మూడు ప్రాంతాలను ఆప్షన్లుగా ఎంచుకొనే అవకాశం కల్పించారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు..మూడు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమిస్తారు. అపాయింట్మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.

సొంత గ్రామం మినహా..
ముఖ్యమంత్రి జగన్ తన మానస పుత్రిక అయిన గ్రామ..వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2 నుండి ప్రారంభించనుంది. దీని కోసం ఇప్పటికే పరీక్షలు..ఇంటర్వ్యూలు పూర్తి చేసారు. ఇప్పుడు పోస్టింగ్ ల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది.
ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది.
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మూడు ఆప్షన్లకు అవకాశం..
ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్సీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు అన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు.

అపాయింట్మెంట్ లెటర్లు
ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా కేంద్రాల్లో అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం మొదలైంది. అపాయింట్మెంట్ లెటర్ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.