నియంతలా వైఎస్ జగన్.. తెలుగును చంపే ప్రయత్నమే, ఏపీ సర్కార్‌పై గుస్సా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. జగన్ వైఖరి సరికాదని కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ హడావిడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన అమలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు.
వెంకన్న దగ్గర జగన్ నాటకాలు: తన మతం చెప్పుకొని..పట్టువస్త్రాలు ఎలా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏకపక్ష నిర్ణయాలు సరికాదు..
రాష్ట్రంలో జగన్ నియంతలా పాలిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలా కాకుండా జగన్ ప్రవర్తిస్తున్నారని ఫైరయ్యారు. విపక్షాలను వేధించడం సరికాదని సూచించారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రభుత్వం చేసే చర్యలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు.

మాతృభాష..
వచ్చే విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషులోనే బోధిస్తారు. దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ మాతృభాషను చంపే ప్రయత్నం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇంగ్లీషు బోధన వద్దు తెలుగు ముద్దు అనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఇంగ్లీషు వద్దు..
ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా ఇంగ్లీషు బోధించడం సరికాదని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌కు ఇంగ్లీషు భాషపై ప్రేమ ఉంటే ప్రత్యేక పాఠశాలలు పెట్టుకోవాలని సూచించారు. అంతే తప్ప ఉన్న స్కూళ్లలో తెలుగును చంపేసి.. ఆంగ్లంలో బోధిస్తామని హుకుం జారీచేయడం ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో నిర్ణయంపై సమీక్షించాలని డిమాండ్ చేశారు.

అప్పుడు వ్యతిరేకించి..
ఇంగ్లీషు సబ్జెక్ట్ వద్దని ఎవరూ చెప్పలేదని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. కానీ ఆంగ్ల మాధ్యమం కోసం తెలుగును చంపేయడం సరికాదని సూచించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు బోధనపై పున:సమీక్షించాలని కోరారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కూడా ఇంగ్లీషులో బోధన ప్రారంభిస్తామని చెప్పిందని గుర్తుచేశారు. అయితే అన్నిపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తంకావడంతో వెనక్కి తగ్గిందని చెప్పారు. ఇంగ్లీషు బోధనపై అప్పుడు జగన్ వ్యతిరేకించాడని కన్నా గుర్తుచేశారు.