జగన్ సర్కార్ లో మరో ఉన్నతాధికారిపై హైకోర్టు ఆగ్రహం- అరెస్ట్ వారెంట్, జరిమానా
ఏపీ ప్రభుత్వంలో కీలక స్దానాల్లో ఉన్న ఐఏఎస్ లు ఇప్పటికే కోర్టు ధిక్కారం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఆయన్ను తక్షణం అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోని కలిదిండి పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేసినప్పటికీ కేసు విచారణ సందర్భంగా ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని నిర్దారించింది. కేసు విచారణలో సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ రీకాల్ కోసం ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ పిటిషన్ వేయగా.. దీన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. అంతే కాదు జైలుశిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందని న్యాయమూర్తి ప్రకటించారు.
ఈ జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని సత్యనారాయణను హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అప్పీలు చేస్తూ శిక్షను నిలిపి వేయాలని కోరిన సత్యనారాయణ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో సత్యనారాయణ విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తా మనిహైకోర్టు తెలిపింది.