నిమ్మగడ్డకు హైకోర్టు భారీ షాక్- పంచాయతీ పోరుకు బ్రేక్- నోటిఫికేషన్ సస్పెండ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఇవాళ హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులతో పాటు పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ఎన్నికల కోసం నిమ్మగడ్డ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఆన్లైన్ ద్వారా విచారణ జరిపిన హైకోర్టు... నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు ఇచ్చింది.

పంచాయతీ పోరుకు బ్రేక్
ఏపీలో కరోనా ప్రభావం తగ్గినందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌పై దాఖలైన పిటిషన్లను ఆన్లైన్ విధానంలో విచారించిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

వ్యాక్సినేషన్‌కు అడ్డంకి అన్న హైకోర్టు
ఈ నెల 16 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దీనిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాల్సి ఉండటం, కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం వంటి అంశాల దృష్ట్యా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సినేషన్లో తాము పాల్గొనేందుకు ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయన్న ఉద్యోగుల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోరా ?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం పట్టించుకోకుండా తన వద్ద నున్న అంశాల ఆధారంగానే ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుందని హైకోర్టు తెలిపింది. దీంతో ఎన్నికల విషయంలో ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఎస్ఈసీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని ధర్మాసం పేర్కొంది. ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఏకపక్షంగా ఉందన్న అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది.