
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటివద్ద హైడ్రామా నడిచింది. ఆయన ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని రఘురామ అనుచరులు, భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడి కదలికలను గమనించారు. ప్రశ్నించినప్పుడు ఒకదానికొకటి పొంతన లేని సమాధానాలిస్తుండటంతోపాటు అతని ఐడీకార్డుకానీ, ఆధార్ కార్డుకానీ చూపించేందుకు నిరాకరించడంతో గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

రెండురోజుల క్రితమే 12 మంది హైదరాబాద్ కు..
తాను ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్ కే సుభానీ అని, రెండు రోజుల క్రితం ఇన్నోవా కారులో హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులకు వెల్లడించాడు. శనివారం ఉదయమే 12 మంది వరకు రెండు కార్లలో హైదరాబాద్ చేరుకున్నారని, వీరిలో ఆరుగురు ఇన్నోవాలో రఘురామ ఇంటివద్ద కాపుకాసినట్లు తెలుస్తోంది. వీరంతా రెండురోజుల నుంచి ఎంపీ రఘురామ వాహనాన్ని వెంబడిస్తూ.. కదలికలను గమనిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన సుభానీ
ఆదివారం రాత్రి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరిన ఎంపీ రఘురామ తనను ఏపీ పోలీసులు వెంబడిస్తున్నారనే అనుమానంతో బేగంపేట స్టేషన్ లో దిగిపోయిన సంగతి తెలిసిందే. సుభానీ సోమవారం ఉదయం ఎంపీ ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్ తో కొన్ని దృశ్యాలను చిత్రీకరించబోయారు. ఇది గుర్తించిన తర్వాతే రఘురామ అనుచరులు అప్రమత్తమై అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి సుభానీ అని, అతడి ఫోన్ కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని గచ్చిబౌలి పోలీసులుగుర్తించారు.

తన పర్సు, ఐడీ కార్డు లాక్కున్నారంటూ సుభానీ ఫిర్యాదు
ఎంపీ ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే గుర్తించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించామని రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. విధినిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారని, చిత్రహింసలకు గురిచేశారని ఎస్ కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మనీ పర్సు, ఐడీ కార్డు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇరువైపులా ఇచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఎస్ ఐ సురేష్ తెలిపారు.