జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్
శ్రీకాకుళం:ప్రతిపక్ష నేత జగన్, జగనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ కు ప్రధాని మోడీని విమర్శించే దమ్ముందా? ...అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కమాట కూడా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం జగన్ చేయలేడని లోకేష్ ఎద్దేవా చేశారు.
మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోకేష్ ఆచి తూచి స్పందించారు. పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తమ అవినీతిపై పవన్ కల్యాణ్ దగ్గర ఆదారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్బంగా ముఖద్వారం పైడిభీమవరంలో విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యాన ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు, అభిమానులు బుధవారం ఉదయం ఘన స్వాగతం పలికారు.

లోకేష్...శ్రీకాకుళం పర్యటన
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ను రాష్ట్ర ఐటి శాఖా మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం జగతిపల్లి హిల్ రిసార్ట్సు, గిరిజన మ్యూజియం,నాలెడ్జి కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్మునికి చేసినట్లు భావించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామాల అభివృద్దికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.


జగన్ పై ఆరోపణలు...విమర్శలు
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ జగన్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను జగన్ కు ఒకటే సవాలు విసురుతున్నానని, జగన్ ప్రధాని మోడీ గురించి ఒక్కమాటైనా వ్యతిరేకంగా మాట్లాడగలరా?...జగన్ కు ఆ దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు.
ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వైసీపీ రాజీనామాలు చేసి ప్రజలకు పంగనామాలు పెడుతోందని లోకేష్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటం అంతా ఓ డ్రామానే అని ఈసడించారు.45 వేల కోట్లు అక్రమంగా సంపాదించి విదేశాల్లో దాచుకున్నాడని ఆరోపించారు.

పవన్ పై ఆచితూచి...విమర్శలు
ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమపై చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, ఎవరిమీదైనా నిరాధారమైన ఆరోపణలు చేయరాదని హితవు పలికారు. పవన్ తమపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడూ నీచ రాజకీయాలు చేయలేదని చెప్పారు. దేశంలో క్రమం తప్పకుంగా ప్రతి ఏడాది ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉంటే అది తమ కుటుంబమేనని లోకేశ్ స్పష్టంచేశారు.

అభివృద్ది పథకాల...వెల్లువ
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 వేల కోట్లు లోటు బడ్జేట్‌లో ఉన్నా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత టిడిపిదేనన్నారు. ఐటీడీఏలను 1986 లో ఏర్పాటు చేసి గిరిజన ప్రాంత అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం మొదటగా బీజం వేసిందని లోకేష్ పేర్కొన్నారు.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇక్కడి అధికారులు అడిగిన రూ. 8 కోట్లు తాను సచివాలయానికి వెళ్లిన వెంటనే మంజూరు చేస్తానని, ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామం, తండాలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళంలో ఐటీ కేంద్రం ఏర్పాటవుతుందని, నిరుద్యోగులకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని లోకేష్ వివరించారు.