ap news ap legislative council winter session mlc resignation pranab mukherjee శీతాకాల సమావేశాలు ఎమ్మెల్సీ రాజీనామా
Andhra Pradesh Legislative Assembly: పోతుల సునీత రాజీనామా ఆమోదం- ప్రణబ్, ఎస్పీబీకి నివాళి
ఇవాళ ఏపీ శాసనసమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మండలి ఛైర్మన్ షరీఫ్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఈ మధ్యే మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు సభ నివాళులు అర్పించింది. అనంతరం సభను బీఏసీ కోసం వాయిదా వేశారు.
వాయిదాకు ముందు దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్, గాయకుడు ఎస్పీబాలుకు నివాళులు అర్పించిన మండలి సభ్యులు.. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సాధారణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఇద్దరూ రాష్ట్రానికి, దేశానికి ఎనలేని పేరు తెచ్చిపెట్టారని సభ్యులు గుర్తుచేసుకున్నారు. అనంతరం సంతాప తీర్మానాలను మండలి ఆమోదిస్తున్నట్లు ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో సభను మొత్తం ఐదురోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 4 వరకూ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 19 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. బీఏసీలో వైసీపీ మొత్తం 21 అంశాలను ప్రతిపాదించింది. టీడీపీ మరో 20 అంశాలపై చర్చ జరగాలని బీఏసీలో పట్టుబట్టింది. బీఏసీ సమావేశం అనంతరం సభ తిరిగి సమావేశమైంది. ఈసారి అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఆమోదించి మండలికి పంపాల్సి ఉంది. వీటిపై విపక్ష టీడీపీ వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి ఆమోదించింది.గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి ఛైర్మన్‌కు గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై మండలి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దాన్ని మండలి ఛైర్మన్ ఆమోదించారు.