చంద్రబాబేమైనా పుడింగా ?యూజ్ లెస్ ఫెలో-పనికిమాలిన మాటలు-బైజూ కామెంట్స్ పై బొత్స
నిన్న విజయనగరం జిల్లా పర్యటనలో తనపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాల్లో మీ అంత పనికిమాలిన వ్యక్తి ఎవరూ ఉండరని ఆయన ఇవాళ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మాటలన్నీ విన్నాను. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజం. అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పే చంద్రబాబు, నిన్న నా నియోజకవర్గంలో చేసిన విమర్శలు, ఆయన వాడిన భాష దారుణమన్నారు.
చంద్రబాబు మాటలు వింటే చంద్రబాబు పూర్తిగా సహనం కోల్పోయినట్లు, ఇక ఆయన పని అయిపోయినట్లు అనిపిస్తోందన్నారు. దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు అధికారం వెన్నుపోటుతో వచ్చిందా? ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చిందా? అ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అనైతిక పనులు చేశావన్నది పక్కన పెడితే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాష చూస్తే.. మీ పని అయిపోయిందనే చెప్పాలని బొత్స అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందని విమర్శించారు.

బైజూస్ అంటే హెరిటేజ్ లో అమ్మే జ్యూస్ కాదని బైజూస్ పై చంద్రబాబు చేసిన విమర్శలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే, అది బైజూసో.. జగన్మోహన్రెడ్డి జూసో.. అంటావా.. ఏమిటా వెటకారం...?. బైజూస్ అంటే హెరిజేట్ లో అమ్మే ఏదైజా జ్యూస్ అనుకుంటున్నావా? లేక హెరిటేజ్ పాలతో చేస్తున్న జ్యూస్ అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. బైజూస్ అనేది 150 మిలియన్ల విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న కంటెంట్ సంస్థ. మీకు దాని గురించి తెలియకపోతే, నీ మనవణ్ని అడుగు చెబుతాడని సూచించారు. ఇంగ్లీష్ బోధన అంటే మమ్మీ - డాడీ అనడం కోసమేనా? మరి మీ అబ్బాయిని అందుకే ఇంగ్లిష్ మీడియమ్‌లో చదివించావా? కేవలం నిన్ను డాడీ అని పిలవడానికేనా? మరి దేని కోసం, ఎందుకోసం మీ కొడుకును విదేశాలకు చదువు కోసం పంపించావు?. అంటే మీ కొడుకు, మనవడు మాత్రమే ఇంగ్లిష్‌లో చదవాలి. వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలి. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలి. అది మీ ఉద్దేశం అని బొత్స చురకలు అంటించారు.
నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు మాత్రం ఇంగ్లిష్ మీడియమ్ చదువులు వద్దు. అదే మీ లక్ష్యం అని చంద్రబాబును బొత్స విమర్శించారు. బైజూస్ ద్వారా ఆ విద్యార్థులు బాగా చదువుకునేలా మంచి కంటెంట్ పెడుతుంటే, దాన్ని కూడా ఎగతాళి చేస్తావా? అని నిలదీశారు. విజయనగరం జిల్లా పర్యటనలో గత 48 గంటల్లో మాట్లాడిన దాంట్లో రాష్ట్రం కోసం, ఆ ప్రాంతం కోసం మాట్లాడిన విషయం ఒక్కటైనా ఉందా..?. వయస్సు, అనుభవం ఉంటేనే సరిపోదు. అవి ఇతరులతో షేర్ చేసుకునేలా ఉండాలి. అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.
మీకు ధైర్యం ఉంటే చర్చ పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందం తప్పు అని, కనీసం ప్రపంచంలో ఒక్కరితో అయినా చెప్పించు. ఒక మేధావితో మాట్లాడించు.. ఆ ఒప్పందం తప్పు అని చెప్పించు అని సవాల్ విసిరారు.