ఏపీ మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్- హోం క్వారంటైన్ లోకి
ఏపీలో ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి కరోనా సోకింది. తాజాగా ఆయనకు నిర్పహించిన కోవిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇవాళ దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు.
ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉండనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా తప్పకుండా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వం తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్లనాని కంటే ఆయనే యాక్టివ్ గా కనిపించారు. కోవిడ్ వైద్యసామాగ్రితో పాటు పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల పరిశ్రమలతోనూ ఆయనే సంప్రదింపులు జరిపారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈసారి మాత్రం ఆయన కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. కరోనా పాజిటివ్ గా తేలినా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగ్గా ఉందని ప్రకటించడంతో నెల్లూరు జిల్లాలో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.